Water Diet : బాబోయ్.. టీనేజర్ ప్రాణం తీసిన వాటర్ డైటింగ్.. అసలేంటి వాటర్ డైటింగ్? ఎందుకంత డేంజర్?

వాటర్ డైటింగ్ అంటూ మంచి నీళ్లు మాత్రమే తాగుతూ అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంది.

Water Diet : బాబోయ్.. టీనేజర్ ప్రాణం తీసిన వాటర్ డైటింగ్.. అసలేంటి వాటర్ డైటింగ్? ఎందుకంత డేంజర్?

Updated On : March 12, 2025 / 12:13 AM IST

Water Diet : మీరు సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఇష్టారీతిన డైటింగ్ చేస్తారా? అయితే బీకేర్ ఫుల్.. ఇష్టం వచ్చినట్లు డైటింగ్ చేసిన ఓ యువతి చివరికి లేవలేని స్థితిలో మంచం పట్టింది. ఆ తర్వాత కన్నుమూసింది. కేరళలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను బరువు పెరుగుతున్నానని అనవసరంగా భయపడిన టీనేజర్ ఆన్ లైన్ లో కనిపించిన ప్రతీ డైటింగ్ ప్లాన్ ని ఫాలో అయింది. చివరికి వాటర్ డైటింగ్ అంటూ మంచి నీళ్లు మాత్రమే తాగుతూ అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంది.

కేరళలో ఓ టీనేజర్ కొన్ని నెలలుగా భోజనం సరిగా చేయడం మానేసింది. బరువు పెరగొచ్చనే భయంతో లేనిపోని కసరత్తు మొదలుపెట్టింది. వెయిట్ లాస్ కు సంబంధించి ఆన్ లైన్ లో ఎవరు సూచనలు చూసినా వాటిని గుడ్డిగా ఫాలో అయ్యేది. ఒక దశలో వాటర్ డైట్ కూడా మొదలు పెట్టింది. అంటే నీళ్లు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోవడం అన్నమాట.

అలా పూర్తిగా నీళ్లు తాగుతూ ఆహారం తీసుకోవడం మానేయడంతో ఆమె శరీరం బాగా దెబ్బతింది. పరిస్థితి చేయి దాటిపోయింది. ఆసుపత్రి పాలైంది. చివరికి కన్నుమూసింది.

ఈటింగ్ డిజార్డర్ ఎనోరెక్సియా నెర్వోసాతో టీనేజర్ చనిపోయింది. ఇంతకీ ఎనోరెక్సియా నెర్వోసా అంటే ఏంటి? ఎనోరెక్సియా నెర్వోసా అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడే వారు బరువు పెరగకున్నా బరువు పెరుగుతున్నట్లుగా ఫీల్ అవుతారు. తింటున్న ఆహారం గురించి మామూలు వాళ్లతో పోలిస్తే చాలా భయపడిపోతుంటారు. బరువు తక్కువగా ఉన్నా తాము ఒబెసిటీ అంటే ఊబకాయులమేమోనని భ్రమిస్తారు.

అలాంటి ఓ అపోహతోనే ఆరోగ్యకరమైన తిండి తినటం పూర్తిగా మానేస్తారు. దారుణంగా పస్తులుంటారు. అలా మెల్లగా శరీరాన్ని చిక్కి శల్యమయ్యేలా చేసుకుంటారు. ఆసుపత్రి పాలైనా ఎనోరెక్సియాతో బాధపడే వారు చెప్పిన మాట వినరు. సరైన ఆహారం తీసుకోరు. ఇదే రీతిలో కేరళకు చెందిన ఓ టీనేజర్ చేతులారా ప్రాణం తీసుకుంది.

కేరళకు చెందిన 18 ఏళ్ల టీనేజర్ కూడా ఇలానే చేసింది. ఐదారు నెలలుగా రకరకాల ఆన్ లైన్ పోర్టల్స్ లో డైట్ ప్లాన్స్ ని ఫాలో అయ్యింది. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనతో ఆహారం తినకుండా కడుపు మాడ్చుకుంది. ఇంట్లో వాళ్లు ఆహారం పెట్టినా వారికి తెలియకుండా దాచేది. కేవలం గోరు వెచ్చని నీరు మాత్రమే తాగేది. ఆమె కనీసం 24 కేజీల బరువు కూడా లేదు. ఆహారం తినకపోవడంతో జబ్బు పడింది. మంచానికే పరిమితమైపోయింది. ఇలా 5 నెలలకు ముందు ఆరోగ్యం పాడు కావడంతో వైద్యులకు చూపించారు తల్లిదండ్రులు.

Also Read : వేసవిలో అతిగా వాటర్ తాగుతున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్లే.. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటే..

అమ్మాయికి మంచి పోషకాహారం పెట్టాలని డాక్టర్లు సూచించారు. సైకియాట్రిస్టులకు కూడా చూపించాలని సలహా ఇచ్చారు. తర్వాత మళ్లీ రెండు నెలలకు ఆరోగ్యం దెబ్బతినడంతో ఆసుపత్రిలో చేర్పించారు. రెండు వారాల క్రితం ఆమె బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. బాడీలో సోడియం, బీపీ లెవెల్స్ కూడా పడిపోయాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందించినా ఉపయోగం లేకుండా పోయింది.

కోవిడ్ తర్వాత ఇలాంటి కేసుల సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. అతి శుభ్రం, అతి జాగ్రత్తగా, అతిగా తినకూడదన్న భావనతో పాటు తాము సన్నగా ఉన్నా లావుగా ఉన్నట్లు ఊహించుకుంటూ తిండి తినడం మానేస్తారు. దీంతో శరీరానికి కావాల్సిన క్యాలరీస్, శక్తిని కోల్పోతారు. అలా మెల్లగా తమ శరీరాన్ని తామే డైట్ పేరుతో కడుపు మాడ్చి హింసిస్తారు. చివరికి మంచి నీళ్లే ఆహారం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కేవలం నీరు తాగి బతికేందుకు ప్రయత్నిస్తారు. ఇది ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. వాటర్ ఫాస్టింగ్ చాలా డేంజరస్ అంటున్నారు.