UP Development Ad : యోగి ఆదిత్యానాథ్‌ యాడ్ లో కోల్‌కతా ఫ్లై ఓవర్..టీఎంసీ విమర్శలు

మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి.

UP Development Ad :  యోగి ఆదిత్యానాథ్‌ యాడ్ లో కోల్‌కతా ఫ్లై ఓవర్..టీఎంసీ విమర్శలు

Mamata Yogi

Updated On : September 12, 2021 / 3:34 PM IST

Yogi Adityanath Development Ad మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి. అయితే ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఘనమైన అభివృద్ధి జరిగిందని పేర్కొంటూ బీజేపీ ప్రభుత్వం తాజాగా ఓ జాతీయ పత్రికకు ఫ్రంట్ పేజ్‌లో ఫుల్ యాడ్ ఇచ్చింది. అందులో సీఎం యోగి ఆదిత్యానాథ్ నిలువెత్తు ఫొటో ఉండగా, కింద భవంతులు, ఫ్లై ఓవర్, ఫ్యాక్టరీల చిత్రాలున్నాయి. అయితే యోగి ప్రచార చిత్రంలో కనిపిస్తున్న అభివృద్ధి చిహ్నాలు-ఫ్లై ఓవర్, భవనాలు టీఎంసీ పాలనలోని పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాకు చెందినవిగా కనిపిస్తున్నాయి. కొందరు జర్నలిస్టులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

దీంతో బీజేపీ ప్రభుత్వంపై… టీఎంసీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక నెటిజన్లు కూడా ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

యోగి ఆదిత్యానాథ్ ప్రచార చిత్రంలో కనిపిస్తున్నది కోల్‌కతాలోని ‘మా ఫ్లై ఓవర్’ అని, జూమ్ చేసి చూస్తే బెంగాల్‌లోనే కనిపించే యెల్లో అంబాసిడర్ ట్యాక్సీలు ఫ్లై ఓవర్‌పై కనిపిస్తున్నాయని టీఎంసీ నేత సాకేత్ గోఖలే తెలిపారు. .ముఖ్యమంత్రులను మార్చుకుంటూ ప్రభుత్వాలను కాపాడుతున్న నరేంద్ర మోడీ నిస్సహాయత కనిపిస్తున్నదని, ఇప్పుడు మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన అభివృద్ధిని సొంత అభివృద్ధిగా చెప్పుకోవడానికీ ఉపక్రమించారని మరో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ఆరోపించారు.

యోగి హయాంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి అంటే మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్‌ లో జరిగిన అభివృద్ధిని సొంత పనిగా చెప్పుకోవడమేనని టీఎంసీ సీనియర్ లీడర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బీజేపీపై విమర్శలు కురిపించారు. బలమైన బీజేపీ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ మోడల్ ఘోరంగా విఫలమైందని, ఈ విషయం ఇలా స్పష్టమైందని అయన ఓ ట్వీట్ చేశారు.