అంబులెన్స్‌లో వచ్చి కిడ్నాప్ యత్నం : కోడలిని కాపాడబోయి మామ మృతి

కోడలిపాలిట ఆ మామ దేవుడిగా మారాడు. కోడలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్ కతాలోని టాంగ్రా ప్రాంతంలోని క్రిస్టోఫర్ రోడ్ వద్ద జరిగింది. కోడళ్లను వేధించే మామలున్నాయి. కానీ ఈ మామ మాత్రం కోడలిని కాపాడటానికి తన ప్రాణాల్నే పోగొట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే..మామ గోపాల్ ప్రమాణిక్ (55) తన కుటుంబసభ్యులతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు.పెళ్లి పూర్తయ్యాక రాత్రి 11:45 గంటల సమయంలో ప్రమాణిక్ కుటుంబసభ్యులతో కలిసి నడిచివస్తున్నాడు. అదే సమయంలో వారి నడిచే చోటికి హఠాత్తుగా ఓ అంబులెన్స్ వచ్చింది. దాంతో వారు పక్కకు తప్పుకున్నారు. కానీ అది మరింత దగ్గరగా వచ్చింది. అంబులెన్స్ డోర్ తెరుచుకుంది.
దాంట్లోంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాణిక్ పక్కనే నడుస్తున్న కోడలు (28)ని అంబులెన్స్‌లోని వ్యక్తులు లోపలికి లాగి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన ప్రమాణిక్ వెంటనే అప్రమత్తమయ్యాడు. తన కుటుంబ సభ్యుల్లోని మరో వ్యక్తితో కలిసి కోడలిని కాపాడేందుకు పరుగెత్తాడు. డ్రైవర్ ను కిటికీ నుంచి పట్టుకోవటానికి యత్నించాడు.
దాంతో అంబులెన్స్ డ్రైవర్ అతన్ని తప్పించుకునే క్రమంలో వాహనాన్ని అతనిపైకి ఎక్కించాడు. దీంతో తీవ్రగాయాలైన ప్రమాణిక్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ..అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దుండగుల కోసం ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు.