Kotappa Konda : కోటివేల్పుల అండ… కోటప్ప కొండ..

దక్ష యజ్ఞం తరువాత పరమేశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కొరకు త్రికూటాద్రి పర్వతంపై 12 సంవత్సరాల పాటు తపమాచరిస్తుండగా పరమేశ్వరుని అనుగ్రహం కొరకు బ్రహ్మ, విష్ణు మరియు సకల దేవతలు, ఋషులు స్వామి కటాక్షం కొరకు అక్కడ తపమాచరించిన పరమేశ్వరుడిని దర్శించుకొని జ్ఞాన దీక్ష పొందారు.

Kotappa Konda : కోటివేల్పుల అండ… కోటప్ప కొండ..

Kotappa Konda (1)

Updated On : December 1, 2021 / 6:23 PM IST

Kotappa Konda : కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామంలో త్రికూటాద్రి పర్వతం వున్నది. దీనిని కోటప్పకొండ , త్రికూటాద్రిగా పిలుచుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. త్రికూటాచల పర్వతంపై పరమశివుడు కొలువై ఉన్నాడు. ఈ పర్వతము పై పరమేశ్వరుడు త్రికూటేశ్వర రూపంలో వెలిశారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. అందుకే దీనికి త్రికూటాచలమని పేరు. ఈక్రమంలోనే స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.

చారిత్రాత్మకమైన ఈ త్రికోటేశ్వర ఆలయం 1172 AD నాటిదని చోళ రాజు కులోత్తుంగ చోళ రాజు మరియు సామంత రాజు మురంగినాయుడు శాసనాల ద్వారా తెలుస్తున్నది. 1584 అడుగుల ఎత్తులో ఉన్న కోటప్ప కొండ శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. ఇక్కడ 600 అడుగుల ఎత్తులో త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది. కొండపై దేవాలయానికి చేరుకోవటానికి 703 మెట్లు గల మార్గం కలదు. ఈ మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రీ రాజామల్ రాజు గుండారాయుల గారిచే నిర్మించబడింది. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అనేక మంది రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు ఆలయ నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో భూమిని దానం చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి తదితర జమీందార్లు ఆలయ అభివృద్ధికి పలు విరాళాలు అందించారు.

దక్ష యజ్ఞం తరువాత పరమేశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కొరకు త్రికూటాద్రి పర్వతంపై 12 సంవత్సరాల పాటు తపమాచరిస్తుండగా పరమేశ్వరుని అనుగ్రహం కొరకు బ్రహ్మ, విష్ణు మరియు సకల దేవతలు, ఋషులు స్వామి కటాక్షం కొరకు అక్కడ తపమాచరించిన పరమేశ్వరుడిని దర్శించుకొని జ్ఞాన దీక్ష పొందారు. అందువలన ఈ ఆలయం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మ చారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కల్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజస్తంభం కూడా ఈ ఆలయంలో ఉండదు. ఇక్కడ ఎటు చూసినా కోటప్పకొండ మూడు శిఖరాలుగా కనిపిస్తోంది. అందుకే కొండకు త్రికూటేశ్వరుడు అనే పేరు వచ్చింది.ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు అంటారు. బ్రహ్మ యొక్క శిఖరంపై బ్రహ్మ నివసించాడని నమ్ముతారు.

స్ధలపురాణం…
కోటప్పకొండకు దిగువన దక్షిణమువైపు కొండకావూరు అను ఒక చిన్న గ్రామము కలదు. అచ్చట నంద, కుందారి అను యాదవ దంపతులు నివసిస్తూ ఉండేవారు ఉండేవారు. వారికి ఆనందవల్లి అను ఒక కుమార్తె కలదు. ఆమె గొప్ప శివభక్తురాలు. ఒకసారి గొల్లభామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వ్రాలి పాలను ఒలకపోయటంతో అది చూచి గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండ కూడదు అని శపించింది. ఆరోజు నుండి ఈ కొండపైకి కాకులు రావు. ప్రతిరోజు తన స్నేహితులతో కలసి రుద్ర శిఖరము పైకి వెళ్ళి స్వామి వారికి అర్చన చేసి వచ్చేది. పరమేశ్వరుడు ఆ గొల్లభామ భక్తిని పరీక్షించుటకు యోగశక్తిచే ‘ఆమెను గర్భవతిగా చేసాడు. అయిననూ ప్రతిరోజూ శిఖరము పైకి వెళ్ళి పూజ చేయుట మానలేదు. గర్భవతియైన ఆనందవల్లి అనే ఆ గొల్లభామ కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా అని శివుడ్ని వేడుకొనగా, ఆమె మొర విని శివుడు గొల్లభామతో అమ్మా నేను క్రిందకు దిగునంతవరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ ఆ గొల్లభామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా, స్వామి ఆమెను అనుసరించాడు. పరమేశ్వరుడు పదధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా, ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూసినది. ఆమెను చూడగానే పరమశివుడు లింగరూపంగా మారాడు. ఆ గొల్లభామ శిల రూపంగా మారినది. ఆ ప్రదేశములోనే కోటేశ్వరాలయం నిర్మించారు. ఈ ఆలయ దిగువ భాగంలో గొల్లబామ శిలగా మారిన ప్రాంతంలో ఆనందవల్లి గుడి నిర్మించారు. ఈ ఆలయాన్ని సాలంకయ్య నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది.

ఈ ఆలయం ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక ప్రక్క వినాయకుడు మరొక ప్రక్క కుమారస్వామి, మధ్యలో మేధా దక్షిణామూర్తి, ఎడమప్రక్క పద్మాసనం మీద ధ్యానములో నిమగ్నమై ఉన్న శివుడి విగ్రహంగల ధ్యానమందిరం ఉంది. ఈ స్వామి అనుగ్రహిస్తే సకల విద్యలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దక్షిణాభిముఖంగా ఉండడం వల్ల దక్షిణామూర్తి అనే పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్ల క్రితం బ్రహ్మశిఖరాన్ని అధిరోహించిన వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు ప్రతిష్ఠించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. దక్షయజ్ఞం అనంతరం కోటప్పకొండలో త్రికోటేశ్వరుడు ధ్యానశంకరుడిగా, దక్షిణామూర్తిగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ, విష్ణువులకు మరియు ఇతర దేవతలకు, ఋషులకు ఇక్కడ బ్రహ్మోపదేశము చేసారు. అందుకే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పడింది.

స్థల పురాణం ప్రకారం, విష్ణు శిఖరం మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశాన్ని అందుకున్నాడు. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. ఘాట్ రోడ్డులో రెండు మలుపుల వద్ద బ్రహ్మదేవుడి విగ్రహం, అదే మలుపులో విష్ణు, లక్ష్మీదేవి, ఆదిశేషుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొండపై భారీ వినాయకుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కాని త్రికూటపర్వతంపై కాకులు వాలవని చెబుతుంటారు. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్లి త్రికుటేశ్వరున్ని సేవించాలని అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోటప్పకొండ ఉత్సవాలు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు.

ఆలయంలో రోజు వారిగా వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు. ఏక రుద్రాభిషేకం ఉదయం 05:30 నిమిషాల నుండి ఉదయం 06:30 నిమిషాల వరకు అభిషేకం ఉదయం 06:30 నిమిషాల నుండి ఉదయం 06:30 నిమిషాల వరకు, అర్చన, దర్శనం ఉదయం 06:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు, ద్వార బంధనం మధ్యాహ్నం 01:30 మిషాల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు, అష్టోత్తర పూజ, దర్శనం, అర్చన మధ్యాహ్నం 03:30 మిషాల నుండి రాత్రి 07:00 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 05:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 01:30 నిమిషాల వరకు. మరియు తిరిగి మధ్యాహ్నం 03:00 గంటల నుండి రాత్రి 07:30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది.

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని కోటప్ప కొండలో ఘనంగా నిర్వహిస్తారు. కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది.