ఏంటి గురూ ఇది..! ఆర్టీసీ బస్సెక్కిన చిలుకలకు టికెట్ కొట్టి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్

ఓ మహిళ తన మనవరాలితో కలిసి నాలుగు చిలుకలున్న బుట్టను తీసుకొని మైసూర్ వెళ్లేందుకు బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్ లో ..

ఏంటి గురూ ఇది..! ఆర్టీసీ బస్సెక్కిన చిలుకలకు టికెట్ కొట్టి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్

KSRTC

KSRTC Conductor : కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా ఉచితమే. అయితే, వారివెంట వారి ఇళ్లలో పెంచుకునే కుక్క పిల్లలు, చిలుకలు, పావురాలు ఇలా పెంపుడు జంతువులను బస్సులో తీసుకెళ్తే వాటికి ఛార్జి చెల్లించాల్సిందే. ఇందుకు ఉదాహరణగా ఆర్టీసీ కండక్టర్ బస్సులో ప్రయాణిస్తున్న నాలుగు చిలుకలకు రూ. 444 టికెట్ కొట్టాడు. దీన్నిచూసి ప్రయాణీకులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Naveen Polishetty : అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయ్యిందా.. చేతికి గాయం..!

ఓ మహిళ తన మనవరాలితో కలిసి నాలుగు చిలుకలున్న బుట్టను తీసుకొని మైసూర్ వెళ్లేందుకు బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్ లో బుధవారం ఉదయం కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కింది. కర్ణాటక ప్రభుత్వ పథకాల్లో ఒకటైన శక్తి యోజన ద్వారా మహిళకు, ఆమె మనవరాలికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు. వారి వద్ద బుట్టలో నాలుగు చిలుకలను చూసి కండక్టర్.. వాటికి టికెట్ తీసుకోవాలని సూచించాడు. కండక్టర్ మాటలకు మహిళ, ఆమె మనవరాలు ఆశ్చర్యపోయారు. చిలుకలకు టికెట్ ఏంటి అని ప్రశ్నించగా.. రూల్స్ అలానే ఉన్నాయి.. కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందేనని ఆదేశించాడు. దీంతో బస్సులోని వారంతా చిలుకలకు టికెట్ ఏమిటని ఆశ్చర్యపోయారు. కండక్టర్ గట్టిగా చెప్పడంతో సదరు మహిళ టికెట్ తీసుకొనేందుకు సిద్ధమైంది.. మొత్తం రూ. 100 ఉంటుందేమో అనుకుంది. కానీ, ఒక్కో చిలుకకు రూ. 111 చొప్పున మొత్తం 444 ఇవ్వాలని కడక్టర్ సూచించడంతో సదరు మహిళ అవాక్యయింది. అయినా, తప్పని పరిస్థితుల్లో రూ. 444 చెల్లించి నాలుగు చిలుకలకు టికెట్ తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కర్ణాటక ఆర్టీసీపై తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

కండక్టర్ నాలుగు చిలుకలకు టికెట్ తీసుకున్నట్లు సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం కావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారమే కండక్టర్ టికెట్ ఇచ్చాడని వెల్లడించారు. ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు ఆఫ్ టికెట్ చెల్లించాల్సిందేనని, టికెట్ తీసుకోకుంటే ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్ ధరలో 10శాతం జరిమానా విధిస్తామని, ఇవ్వని కండక్టర్ పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని నిబంధనల్లోనే ఉందని అధికారులు తెలిపారు. దీంతో, కర్ణాటక ఆర్టీసీ నిబంధనలను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.