వయనాడ్‌లో 133కు చేరిన మృతుల సంఖ్య.. ఇంకా దొరకని వందల మంది ఆచూకీ.. సహాయక చర్యల్లో ఆర్మీకి చెందిన శునకాలు

కేరళలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటిలో మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసరోగోడ్, కన్నూరు జిల్లాలు ఉన్నాయి. వచ్చే 24గంటలు ఆయా ప్రాంతాల్లో ..

వయనాడ్‌లో 133కు చేరిన మృతుల సంఖ్య.. ఇంకా దొరకని వందల మంది ఆచూకీ.. సహాయక చర్యల్లో ఆర్మీకి చెందిన శునకాలు

Wayanad Landslide

Kerala Landslide : వయనాడ్ లో ప్రకృతి కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసాన్ని సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో వంద మందికిపైగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ల నుంచి తీసిన చిత్రాల్లో విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సహాయక చర్యల్లో వేగం పెంచినాకొద్ది మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. బుధవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 126కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో 133 మంది వరకు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 100 మంది ఆచూకీ లభించలేదు. వారికోసం శిథిలాల కింద వెతుకులాట కొనసాగుతుంది. మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన శునకాలను వినియోగిస్తున్నారు.

Wayanad Landslide

కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా నాలుగు గ్రామాలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని మేపద్ది, ముండక్కై, చురల్‌మల, అత్తమాల, నూల్‌పుజా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నివాసాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. మరోవైపు వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికితోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. మండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాపీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. అక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో పని చేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా మండక్కైలోనే నివాసం ఉంటున్నారు. వీరంతా గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Wayanad Landslide

కేరళలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటిలో మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసరోగోడ్, కన్నూరు జిల్లాలు ఉన్నాయి. వచ్చే 24గంటలు ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు ఇవాళ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.