లోక్‌సభ ఎన్నికల సెకండ్ ఫేజ్ పోలింగ్.. 13 రాష్ట్రాలు, 88 ఎంపీ సీట్లకు ఎన్నికలు

ఎన్నికలు జరగబోయే లోక్‌సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి.

Lok sabha election 2024 phase 2 polling: సెకండ్ ఫేజ్ లోక్‌సభ ఎన్నికలకు అంతా రెడీ అయింది. 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 26) ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు జరగబోయే లోక్‌సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నాటకలో 28 సీట్లలో 14 సీట్లకు సెకండ్ విడతలో పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో 25 సీట్లకు గాను 13 చోట్ల, యూపీలో 80 సీట్లలో ఎనిమిది సీట్లకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆరు, అస్సాంలో ఐదు, ఛత్తీస్‌గడ్‌లో మూడు, బీహార్‌లో ఐదు, మహారాష్ట్రలో 8, పశ్చిమ బెంగాల్‌లో మూడు, త్రిపురలో రెండు, జమ్మూకశ్మీర్‌లో ఒక సీటుకు సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది.

ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దాంతో 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 51 సీట్లు, ఎన్డీఏ మిత్రపక్షాలు ఎనిమిది సీట్లు, కాంగ్రెస్ 21 ఎంపీలు గెలుచుకుంది.

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖులు
రెండో విడత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 12 వందల 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పలువురు ప్రముఖులు తమ సెకండ్ ఫేజ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం సీటులో తలపడుతున్నారు. మధుర లోక్‌సభ సీటులో హేమామాలిని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ సీటు నుంచి బరిలో ఉన్నారు. BJYM నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ లీడర్ కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అమరావతి లోక్‌సభ సీటులో ఈసారి బీజేపీ క్యాండిడేట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎంపీ నవనీత్ రాణా.

ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో బిహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఎండల ఎఫెక్టుతో ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు.

బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్
రెండో దశ ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. సౌత్‌లోని కేరళలో 20 సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో.. సీరియస్‌గా ఫోకస్ పెట్టింది బీజేపీ. ప్రధాని మోదీ, అగ్రనేతలంతా వరుస పెట్టి కేరళాను చుట్టేశారు. ఈసారి కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది బీజేపీ. గతంలో కంటే ఈసారి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు కమలనాథులు. 2019 ఎన్నికల్లో కేరళలో బీజేపీకి 12.93శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసి ఒక్కసీటులో కూడా గెలవలేదు బీజేపీ. ఈ సారి మాత్రం కేరళలో బీజేపీ పట్టు పెరిగినట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది. ఓట్ల చీలికతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు

ఓటు వేస్తే డిస్కౌంట్
యూపీలోని 8 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కోటీ 67 లక్షల మంది ఓటు వేయనున్నారు. అయితే ఓటుహక్కు వినియోగించుకున్నవారికి యూపీలోని నోయిడాలో రెస్టారెంట్లు డెమోక్రసీ డిస్కౌంట్ ప్రకటించాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని హోటల్స్ లో ఈ నెల 26, 27వ తేదీల్లో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఓనర్లు ప్రకటించారు. వేలికి ఉన్న సిరాగుర్తు చూయించి, ఈ ఆఫర్ను పొందొచ్చని తెలిపారు. అలాగే నోయిడాలోని పలు హాస్పిటల్స్కూడా ఓటేసి వచ్చిన వారికి రూ. 6,500 విలువైన ఫుల్ బాడీ చెకప్ను ఫ్రీగా అందిస్తామని ప్రకటించాయి.

సౌత్ స్టేట్ కర్నాకటలో 14 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నట్టు ర్యాపిడో ప్రకటించింది. బెంగళూరు, మైసూర్, మంగళూరులోని దివ్యాంగులు, సీనియర్సిటిజన్లు వోట్ నౌ అనే కోడ్ను ఉపయోగించి ఫ్రీ రైడ్ చేయొచ్చని ర్యాపిడో ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు