Jallianwala Bagh : జలియన్ వాలాబాగ్ ఆధునికీకరణపై రాహుల్ వర్సెస్ అమరీందర్
పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ స్మారకంగా పునరుద్ధరించిన కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Rahul Amarinder
Jallianwala Bagh పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ స్మారకంగా పునరుద్ధరించిన కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. 1919 నాటి ఘటనలను గుర్తుకు తెచ్చే విధంగా సౌండ్ అండ్ లైట్ షోను కూడా నిత్యం వీక్షించే విధంగా నూతన హంగులతో దీనిని తీర్చిదిద్దారు. అయితే బ్రిటిష్ కాలం నాటి దారుణమైన మారణకాండకు సాక్ష్యమైన స్మారక వనాన్ని పునరుద్దరించడంపై కేంద్రంపై విపక్షాలు,చరిత్రకారులు సహా పౌర సమాజం నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ లోనే ఈ అంశంపై భిన్నస్వరాలు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
1919లో జలియన్‌వాలా బాగ్ ప్రాంతంలో సమావేశమైన భారతీయులపై జనరల్ డయ్యర్ నేతృత్వంలో బ్రిటీష్ బలగాలు జరిపిన కాల్పులు జరపడంతో వందలాది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత జాతీయ ఉద్యమాన్ని ఈ మారణకాండ కీలక మలుపు తిప్పింది. జలియన్‌వాలా బాగ్ ఘటన ప్రదేశంలోని మైదానాలు, రాతి స్మారకాలు, ద్వారాలు భారతదేశపు గంభీరమైన, బాధాకరమైన గతాన్ని గుర్తు చేస్తాయి. ప్రస్తుతం మోదీ సర్కార్ ఈ ప్రదేశానికి హంగులు జోడించింది. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు 1919 ఏప్రిల్ 13న జరిగిన ఘటనను ప్రతిబింబించేలా సౌండ్, లైట్ షో లను ప్రతిరోజూ నిర్వహిస్తోంది. బ్రిగేడియర్ జనరల్ ఆర్‌హెచ్ డయ్యర్ ఆధ్వర్యంలోని బ్రిటీష్ సైన్యం, సమావేశం జరుగుతోన్న పార్క్‌లోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన ఇరుకైన సందుల్ని కూడా ఆధునీకరించారు. మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఆ సందుల్లో కుడ్య చిత్రాలతో పాటు శిల్పాలను ఏర్పాటు చేశారు. అక్కడి అమరవీరుల బావిని పారదర్శకంగా ఉండే తెరతో కప్పి వేశారు. నాడు బ్రిటీష్ సైన్యం బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు ఎంతోమంది ఈ బావిలో దూకినట్లు చరిత్ర చెబుతోంది.
అయితే, కొత్త తరాలు, ఈ స్థలం చరిత్ర గురించి తెలుసుకునేందుకు, మన గతం నుంచి నేర్చుకునేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని కొత్తగా పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పగా..దేశ చరిత్రను చెరిపివేయడానికి, గతాన్ని వక్రీకరించడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ఘటన ప్రదేశాన్ని ఆధునీకరించడం అంటే, ఘటన తాలూకూ మిగిలిన చివరి ఆనవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టడమేనని, ఈ ప్రాజెక్టు చరిత్రను మాయం చేసేందుకు, దానికి ఆకర్షణను జోడించేందుకు ప్రయత్నించిందని పలువరు చరిత్రకారులు విమర్శలు గుప్పిస్తున్నారు. జలియన్‌వాలా బాగ్‌కు వెళ్లినప్పుడు ప్రజలు ఆ ప్రాంతపు బాధను, వేదనను అనుభవించగలగాలి.. కానీ అందమైన గార్డెన్లతో ఇప్పుడు అది వినోదం పంచే ప్రదేశంగా మారిపోయిందని.. నిజానికి అది ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం కాదని పలువురు చరిత్రకారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా జలియన్ వాలా బాగ్ మెమోరియల్ విషయమై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని ఆధునికీకరించడం అమరులను అవమానించడమేనని రాహుల్ ఆరోపించారు. ఆత్మ బలిదానానికి అర్థం తెలియని ఓ వ్యక్తి మాత్రమే ఈ విధంగా అవమానించగలరని మండిపడ్డారు. తాను అమరవీరుడి కుమారుడినని.. అమరవీరులకు అవమానం జరగడాన్ని తాను ఏమాత్రం సహించనని.. ఈ అసభ్యకరమైన క్రూరత్వానికి మేం వ్యతిరేకం అని గాంధీ ఇవాళ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ మీడియా కథనాన్ని కూడా రాహుల్ జత చేశారు. ఆధునికీకరణ పేరుతో చరిత్రను ధ్వంసం చేశారని ఈ కథనం పేర్కొంటోంది.
అయితే రాహుల్ వ్యాఖ్యలను స్వయంగా ఆ పార్టీ సీఎంయే వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ..జలియన్ వాలా బాగ్ అంశంపై విమర్శించిన కొన్ని గంటల్లోనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏం తొలగించారో నాకు తెలియదు కానీ ఈ ఆధునికీకరణ పనుల తర్వాత జలియన్ వాలా బాగ్ నాకైతే చాలా బాగా ఉందని అనిపిస్తోంది అని అమరీందర్ అనడం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు,పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ని తొలగించాలంటూ ఆ రాష్ట్రంలోని పలువరు మంత్రులు,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కి ఫిర్యాదులు చేస్తున్న వేళ అమరీందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ లో యూనిట్ లో పెద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.