Diya Kumari on Vasundara Raje: వసుంధర రాజే వల్లే దియా కుమారికి సీఎం కుర్చీ మిస్ అయిందా? డిప్యూటీ సీఎం అయ్యాక దియా ఏమన్నారంటే?
అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి 71,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు.

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి పదవికి జైపూర్ రాజకుటుంబానికి చెందిన యువరాణి దియా కుమారిని బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. తనపై నమ్మకం ఉంచి ప్రజలకు సేవ చేసేందుకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. “మహిళల పట్ల ప్రధానమంత్రి మోదీ శ్రద్ధ వహిస్తున్నారు. మహిళల్ని కేంద్రంగా ఉంచే విధానాలు అనేకం రూపొందించారు. ఈ రోజు నాపై విశ్వాసం చూపించి నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ధన్యవాదాలు’’ అని ఆమె అన్నారు.
ఇది కూడా చదవండి: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఉలిక్కిపడ్డ ఎంపీలు
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “నన్ను అర్హులుగా భావించి, నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ఇన్‌చార్జ్‌లు, మిగిలిన అందరికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉన్నాను. ప్రభుత్వంలో ఉన్నవారందరం కలిసి పని చేస్తాము” అని అన్నారు. అయితే మాజీ ముఖ్యమత్రి వసుంధర రాజేను పక్కన పెట్టి దియా కుమారికి అవకాశం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. వసుంధర రాజేతో ఉన్న వివాదాల వల్లే దియాక కుమారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే ఊహాగానాలపై ఆమె స్పందించలేదు. “నేను అలాంటి వాటిపై వ్యాఖ్యానించను. మేమంతా కలిసి పని చేశాము. ఆమె కూడా ఉన్నారు. ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నాను” అని దియా కుమారి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై 71,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దియా కుమారి జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు. తనను తాను జైపూర్ కుమార్తె, వీధుల్లో నడిచే యువరాణి అని పిలుచుకుంటూ ఓటు వేయాలంటూ జైపూర్ లో ఎన్నికల ప్రచారం చేశారు. 2013లో బీజేపీలో చేరినప్పటి నుంచి దియా కుమారి రెండు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. 2013లో సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌సమంద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అంతర్గత పోరు.. సోషల్ మీడియాలో రచ్చచేస్తున్న అభిమానులు..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ 115 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 69 సీట్ల దగ్గరే చతికిల పడిపోయింది. అనంతరం రాజస్థాన్ కు భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన పేరును మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేనే స్వయంగా ప్రకటించారు.