BJP Social Media Fight : తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అంతర్గత పోరు.. సోషల్ మీడియాలో రచ్చచేస్తున్న అభిమానులు..
సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చను నేతలు కంట్రోల్ చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి

Telangana BJP
Telangana BJP : శాసనసభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి సీట్లను గెలుచుకోలేక పోయిన తెలంగాణ బీజేపీకి.. తాజాగా కొత్త తలనొప్పి వచ్చిపడింది. బయటి సమస్యలకుతోడు ఇప్పుడు అంతర్గత సమస్యలుకూడా బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ఇది ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. 2020లో తెలంగాణ బీజేపీ సారథిగా నియమితులైన బండి సంజయ్.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకువచ్చారు. కానీ, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అయితే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ సారథిగా కొనసాగిఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది.
Also Read : CM Mohan Yadav : మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న 11 రాష్ట్రాల సీఎంలు
మరోవైపు బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్ అనుచరులు. తన అనుచరులంటూ టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంట్ పరిధిలోకూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని సోషల్ మీడియాలో ఈటల అనుచరులు ఫుల్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్‌ను తొలగించడం అధిష్టానం నిర్ణయమని.. దీనికి ఈటల ఎలా కారణమవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బీజేపీ ఎందుకు బలోపేతం కాలేదని పోస్టులు పెడుతున్నారు. ఈటల, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ఓడిపోయేలా బండి సంజయ్ పనిచేశారని.. తెరవెనుక డాక్టర్ లక్ష్మణ్, మురళీధర్ రావు కూడా ఉన్నారని ఈటల వర్గం ఆరోపిస్తోంది.
ఇక ఈ సోషల్ మీడియా వార్ బండి, ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని సైతం వదలడం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. బండి సంజయ్‌కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. మరోసారి బండిని పార్టీ అధిష్టానం మోసం చేస్తుందని.. అందుకే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోకూడదని.. కావాలంటే చివరి రెండేళ్లు ఆ బాధ్యతను తీసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చను నేతలు కంట్రోల్ చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి.