90వేల మార్క్ దాటిన మహారాష్ట్ర…ఒక్క ముంబైలోనే 51వేల కరోనా కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : June 9, 2020 / 03:41 PM IST
90వేల మార్క్ దాటిన మహారాష్ట్ర…ఒక్క ముంబైలోనే 51వేల కరోనా కేసులు

Updated On : June 9, 2020 / 3:41 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది. ఒక్క ముంబై సిటీలోనే 51వేలకు పైగా కేసులు,1760 మరణాలు నమోదయ్యాయి. గత వారమే మహారాష్ట్ర కరోనా కేసుల్లో చైనాను దాటిపోయిన విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 2259 కొత్త కరోనా కేసులు,120మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఇప్పటివరకు 90,787కరోనా కేసులు,3,289మరణాలు నమోదయ్యాయి.

ఇప్పటివరకు 42,638మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ఉద్దవ్ సర్కార్ తెలిపింది. దేశంలో ఎక్కువ కేసులు,మరణాలు నమోదైంది మహారాష్ట్రలోనే. లాక్ డౌన్ నిబంధనలు తగ్గించడానికి మహారాష్ట్ర జాగ్రత్తగా మరికొన్ని అడుగులు వేసిన కొన్ని రోజుల తరువాత ఈ కేసులు పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు గత వారం 15 శాతం ఉద్యోగులతో పనిచేయడానికి అనుమతించబడిన విషయం తెలిసిందే. ప్రైవేటు కార్యాలయాలు నిన్నటి నుండి 10 శాతం సిబ్బందితో పనిచేయడం ప్రారంభించాయి.

తప్పనిసరిగా సామాజిక దూరం మరియు భద్రతా నిబంధనలు పాటిస్తూ  ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెస్ట్ కంట్రోల్ మరియు సాంకేతిక నిపుణులు వంటి స్వయం ఉపాధి వ్యక్తులు(Self-employed people) కూడా పనిని ప్రారంభించడానికి అనుమతించబడ్డారు. అయితే వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని… దేశంలోని ఇతర ప్రాంతాలలో పనిచేయడం ప్రారంభించిన ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటళ్ళు మరియు రెస్టారెంట్లను తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతివ్వలేదు.

కాగా,దేశవ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. వరుసగా తొమ్మిది రోజులుగా 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల 2.66లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదైన టాప్ 10దేశాల లిస్ట్ లో భారత్ 5వ స్థానానికి చేరుకుంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల లిస్ట్ లో మొదట అమెరికా ఉండగా,రెండో స్ధానంలో బ్రెజిల్,మూడవ స్థానంలో రష్యా,నాల్గవ స్థానంలో యూకే ఉండగా,5వ స్థానంలో భారత్ నిలిచింది.