Maharashtra Election 2024 : మహారాష్ట్రలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 58.22 శాతంగా నమోదు!
Maharashtra Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 58.22శాతం ఓటింగ్ నమోదైంది. ఔరంగాబాద్‌లో 60.83శాతం, అహ్మద్‌నగర్‌లో 61.95శాతం పోలింగ్ నమోదైంది.

Maharashtra Election 2024 Live Updates
Maharashtra Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు (నవంబర్ 20) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అయితే, సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 58.22శాతం ఓటింగ్ నమోదైంది. ఔరంగాబాద్‌లో 60.83శాతం, అహ్మద్‌నగర్‌లో 61.95శాతం పోలింగ్ నమోదైంది.
మరోవైపు ముంబైలో 49.07శాతం, నాగ్‌పూర్‌లో 56.06శాతంగా నమోదయ్యాయి. సతారాలో 64.16శాతం ఓటింగ్ నమోదైంది. మహాయుతి కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రత్యర్థి వైపు, ఎంవీఏ కూటమిలో 101 మంది అభ్యర్థులతో కాంగ్రెస్, 95 మందితో శివసేన (UBT), 86 మంది అభ్యర్థులతో NCP (శరద్ పవార్) ఉన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తో కూడిన ప్రతిపక్షం మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ), ఎన్సీపీ, (SP) మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నవంబర్ 20న సాయంత్రం 6:30 గంటల తర్వాత వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన రెండో దశ ఎన్నికలలో సాయంత్రం 5 గంటల సమయానికి 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 67.59శాతం ఓటింగ్ నమోదైంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు 4వేల 136మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహారాష్ట్రలో లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మహారాష్ట్రలో సినీ, రాజకీయ, క్రీడాప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. థానేలో సీఎం ఏక్‌నాథ్ శిండే కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్సీపీ ఎస్పీ పార్టీ అధినేత శరద్ పవార్ బారామతిలో తన ఓటును వేశారు. శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, సతీమణి రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సినీ తారలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, అర్బాన్ ఖాన్, సోనూ సూద్, జోయా అక్తర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈనెల 23న వెలువరించనున్నారు.
Read Also : Mohini Dey : రెహమాన్ విడాకులిచ్చిన కొన్ని గంటలకే.. ఆ లేడీ మ్యూజిషియన్ కూడా విడాకుల ప్రకటన..