మహిళలకు రూ.2500 స్కీమ్ ప్రారంభోత్సవం.. డబ్బులు అకౌంట్ లో ఎప్పటి నుంచి పడతాయంటే..
అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం నెలకు రూ.2500 అందించనుంది.

Mahila Samriddhi Yojana
Mahila Samriddhi Yojana: ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2500 అందించనున్నారు.
ఢిల్లీలో గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అధికారంలోకి రాగానే మహిళా సమృద్ధి యోజన కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ. 2500 అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే, ఈ పథకంకు అర్హత పొందాలంటే.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించని మహిళలు, పన్ను చెల్లించని వారు ఈ పథకంకు అర్హులు. ఢిల్లీలో ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్న మహిళలు ఈ పథకం ప్రయోజనాలు పొందుతారు.
ఈ పథకంకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తామని, అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ పథకంకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చిరునామా, రిజిస్టర్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతున్న మహిళా సమృద్ధి యోజన పథకం ద్వారా 15 నుంచి 20 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత పథకం ప్రయోజనాలను అందించే తేదీని ప్రకటించడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ మార్చి 8న ప్రారంభమవుతుందని, అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తామని, ఆ తర్వాత ఆర్థికంగా పేద ప్రతి మహిళకు రూ.2,500 అందించే మొత్తం ప్రక్రియ ఒకటిన్నర నెలల్లో పూర్తవుతుందని చెప్పారు.