నరబలికి దరఖాస్తు..నా కొడుకుని బలిస్తా అనుమతివ్వండి

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 08:34 AM IST
నరబలికి దరఖాస్తు..నా కొడుకుని బలిస్తా అనుమతివ్వండి

Updated On : February 2, 2019 / 8:34 AM IST

యుగాలు మారాయి..తరాలు మారాయి..కానీ మనుషులు ఇంకా మూఢనమ్మకాల ఊబిలోనే కూరుకుపోయి ఉన్నారు. కంప్యూటర్ యుగంలోనూ చేతబడి,  క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలు అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి  కూడా వెనకాడటం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ ఓ తండ్రి సొంత కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు తన కొడుకు బలికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులకు వినతి పత్రం కూడా పంపించాడు.

కలకలం రేపుతున్న ఈ ఘటన బీహార్‌లోని మోహన్‌పూర్‌లో చోటు చేసుకుంది. తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్, ఇంజినీర్ చదువుతున్నతన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లేఖ, సురేంద్ర ప్రసాద్‌ ఓ విలేకరితో మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఆ వీడియోలో సురేంద్రప్రసాద్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ నరబలి నేరం కాదు. ఇంజనీర్‌ అయిన నా కొడుకును మా ఆరాధ్య దేవత అయిన కామాఖ్యదేవికి బలి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా మొదటి నరబలి.  నా ఆరాధ్య దేవత గుడికి ఆర్థిక సాయం చేయడానికి నా కొడుకు నిరాకరించాడు. అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నాను.నరబలికి అనుమతి ఇవ్వండి’  అంటూ అధికారులకు విన్నవించాడు.

అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు. నరబలి చట్టవిరుద్ధమని, త్వరలోనే తాంత్రికుడిని పట్టుకుంటామని తెలిపారు.   అయితే ఈ వ్యాఖ్యలను స్థానికులు నమ్మడం లేదు. సురేంద్ర పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని, వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.