హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రుల రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామం ఎదురైంది. హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.

హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రుల రాజీనామా

Manohar Lal Khattar resigns as CM of Haryana

Manohar Lal Khattar : లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇబ్బందికర పరిణామం ఎదురైంది. హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) మధ్య విభేదాలు నెలకొనడంతో ఖట్టర్ తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఖట్టర్‌తో పాటు ఆయన క్యాబినెట్‌ మంత్రులు కూడా రాజీనామా చేశారు. వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు రాజీనామా లేఖలు సమర్పించారు. వారి రాజీనామాలను గవర్నర్ వెంటనే ఆమోదించారు. లోక్‌సభ సీట్ల సర్దుబాటులో దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జేజేపీతో విభేదాలు తలెత్తడంతో హరియాణ సంకీర్ణ ప్రభుత్వంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఖట్టర్ మళ్లీ హరియాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నేత కన్వర్ పాల్ గుర్జార్ తెలిపారు. జననాయక్ జనతా పార్టీతో భాగస్వామ్యం వదులుకున్నందున ఖట్టర్, ఆయన క్యాబినెట్ రాజీనామా చేసింది. 2019లో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, పార్టీ నాయకుడు తరుణ్ చుగ్‌లను పరిశీలకులుగా హరియాణకు బీజేపీ పంపించింది.

ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హరియాణ లోక్ హిత పార్టీ ఎమ్మెల్యేతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయ పార్టీ సిద్ధమైంది. హరియాణలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.బీజేపీ 41, కాంగ్రెస్ 31, జేజేపి10 మంది ఎమ్మెల్యేలను కలిగివున్నాయి. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. INLD, HLP ఒక్కో ఎమ్మెల్యేను కలిగివున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

Also Read: మోదీ మాట అంటే మాటే.. భారత ప్రధానిపై పాకిస్థాన్ మహిళ ప్రశంసలు