జైలు నుంచే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలనపై మండిపడ్డ బీజేపీ ఎంపీ మనోజ్ తివారి

కేజ్రీవాల్ జైలు నుంచి సీఎంగా కొనసాగడంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి తీవ్రంగా స్పందించారు.

జైలు నుంచే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలనపై మండిపడ్డ బీజేపీ ఎంపీ మనోజ్ తివారి

Manoj Tiwari: లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకటించారు. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అవినీతి ఆరోపణలతో అరెస్టైన కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. అయితే కమలం పార్టీ నాయకుల వ్యాఖ్యలను ఆప్ నేతలు కొట్టిపారేస్తున్నారు. జైలు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేయొద్దని ఏ రాజ్యాంగంలో లేదని కౌంటర్ ఇస్తున్నారు.

ప్రజలు చెప్పిందే కేజ్రీవాల్ చేస్తారు: ఢిల్లీ మంత్రి
ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ కొనసాగుతారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పునరుద్ఘాటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఏం చెబితే అదే చేస్తారని, దాని ప్రకారమే కీలక నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. జైలు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసే నిర్ణయం తీసుకునే ముందు ఆయన తన ఎమ్మెల్యేలందరినీ సంప్రదించారని వెల్లడించారు.
కౌన్సిలర్లను, అన్ని వార్డుల్లో ప్రజలతో మాట్లాడారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగాలని అందరూ అభిప్రాయపడ్డారని చెప్పారు.

కేజ్రీవాల్ ఢిల్లీని దోచుకున్నారు: మనోజ్ తివారి
కేజ్రీవాల్ జైలు నుంచి సీఎంగా కొనసాగడంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి తీవ్రంగా స్పందించారు. ముఠాలు జైలు నుంచి నడుస్తాయి.. ప్రభుత్వం కాదు అంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఢిల్లీని దోచుకున్నారని, ఆయన అరెస్ట్ గురించి ఎవరూ చర్చించకుండా జనం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఢిల్లీని కేజ్రీవాల్ దుర్భర స్థితికి తీసుకువచ్చాడని, ఢిల్లీ ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్వీట్లు పంచిపెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏ పనీ చేయలేదని.. దోచుకుని జేబులు నింపుకున్నారన్నారని దుయ్యబట్టారు. మీడియాలో హడావుడి చేసేందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు చేస్తోందని ఆరోపించారు.

Also Read: ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాలు.. ఆప్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ అధికారుల సోదాలు

ఆప్ నిరసనలకు కాంగ్రెస్ సంఘీభావం
కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. కేజ్రీవాల్ అరెస్టు వ్యతిరేక నిరసనను దేశవ్యాప్త ఉద్యమంగా మార్చడానికి ఆప్ సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 25న హోలీ జరుపుకోకూడదని నిర్ణయించింది. 26న ప్రధాని నివాస ముట్టడికి పిలుపిచ్చింది. ఢిల్లీలోని షహీదీ పార్క్ నుంచి ప్రజా ఉద్యమం ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ నివాసంలో తాజాగా ఈడీ సోదాలు నిర్వహించింది.