త్వరలో మెట్రో రైలు సేవలు పునరుద్ధరణ

  • Published By: bheemraj ,Published On : August 23, 2020 / 09:31 PM IST
త్వరలో మెట్రో రైలు సేవలు పునరుద్ధరణ

Updated On : August 24, 2020 / 6:46 AM IST

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రయోగాత్మక పద్ధతిన ఢిల్లీలో మెట్రో రైలు సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. మెట్రో రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



డిజిటల్‌ సంవాద్‌ పేరుతో నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో ఆదివారం (ఆగస్టు 23, 2020) కేజ్రీవాల్‌ మాట్లాడుతూ మెట్రో రైళ్ల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు ప్రస్తావించామని తెలిపారు. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని అన్నారు.

ఢిల్లీలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ఇతర నగరాల్లో మెట్రో సర్వీసులను పునరుద్ధరించకున్నా ఢిల్లీలో మాత్రం ప్రయోగాత్మకంగా మెట్రో రైళ్లను అనుమతించాలని కోరారు. దశలవారీగా మెట్రో సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావొచ్చని సూచించారు. చాందినీచౌక్‌ అభివృద్ధి ప్రాజెక్టు తరహాలో ఢిల్లీలో రోడ్లు, మార్కెట్లను సుందరీకరిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.



ఢిల్లీలో ఆదివారం కొత్తగా 1450 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1.61 లక్షలకు చేరింది. వీరిలో 1.45 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో ప్రస్తుతం 627 కంటైన్మెంట్‌ జోన‍్లలో 11,778 యాక్టివ్‌ కేసులున్నాయి.