ఉల్లి కన్నీళ్లు తుడిచేందుకు కేంద్రం చర్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 1, 2019 / 12:40 PM IST
ఉల్లి కన్నీళ్లు తుడిచేందుకు కేంద్రం చర్యలు

Updated On : December 1, 2019 / 12:40 PM IST

ఉల్లి ధరలు సామాన్య ప్రజల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో ఉల్లిపాయల కొరత ఏర్పడింది. ఉల్లి పోటు కారణంగా చాలా హోటల్స్ లో వాటి వినియోగం ఆపేశారు. చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరాలను పెంచేందుకు టర్కీ నుంచి 11వేల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుమతులకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఆర‍్డర్‌ ఇచ్చింది. డిసెంబర్ చివరినాటికి లేదా జనవరి ప్రారంభంలో టర్కీ నుంచి ఉల్లి భారత్ కు దిగుమతి కానుంది.

ఎంఎంటీసీ సంస్థ ఇప్పటికే ఈజిప్ట్‌ నుంచి 6వేల90 మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతికి ఆర్డర్ ఇచ్చింది. డిసెంబర్ మధ్యలో ఈజిప్ట్ నుంచి భారత్ కు ఉల్లి దిగుమతి రానుంది. ఇక ప్రస్తుత ఆర్డర్‌తో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో రూ 75 నుంచి రూ 120 వరకూ ఉల్లి ధరలు పలకడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉల్లి ఎగమతులపై నిషేధం విధించిన కేంద్ర కేబినెట్‌ 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆమోదం తెలిపింది.

ఇక దిగుమతి చేసుకున్న ఉల్లిని ఆయా రాష్ట్రాలకు కిలో రూ 50 నుంచి 60లకు అందచేస్తారు. మరోవైపు ఉల్లి ధరలను సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, వ్యవసాయ, రవాణా శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు.