మోడీ రికార్డు..పాలకుడిగా 20 ఏళ్లు

Modi enters 20th year in public office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత..ప్రభుత్వాధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. సీఎంగా, ప్రధానిగా ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు. 2001, అక్టోబర్ 07వ తేదీన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు.
వరుసగా మూడుసార్లు సీఎంగా పనిచేశారు. అనంతరం దేశ రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో పార్టీని ముందుండి నడిపించారు. అనంతరం బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. పది సంవత్సరాల పాలన చేస్తున్న కాంగ్రెస్ కు చెక్ పెట్టారు. 2014, 2019లో ప్రధానిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారాయన.
2001లో గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. రైతులు, ప్రజల్లో విశ్వాసం కల్పించారు. ప్రతి ఇంటికి కరెంటు అందించడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలోని భారీగా పెట్టుబడులను ఆకర్షించారు.
2003లో రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సును నిర్వహించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. పలు కంపెనీలు భారీగా పేట్టుబడులు పెడుతుండడంతో గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకపోయింది.
ఇక..2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ..ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైంది 2016లో పెద్ద నోట్లు రద్దు, 2017లో GST, 2018లో ఆయుష్మాన్ భారత్ పథకం, 2019లో ఈబీసీ రిజర్వేషన్లు, భేటీ పడావో-భేటీ బచావో, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA).. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
పలు చట్టాలను సైతం మార్చేశారు. పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్తాన్ బాలకోట్‌లో దాడులు జరిగాయి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య రామజన్మభూమి వివాదానికి కూడా మోదీ హయంలోనే పరిష్కారం లభించింది. ఆగస్టులో అయోధ్యలో జరిగిన రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు.
ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. గతంలో కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు అన్ లాక్ లో భాగంగా..పలు రంగాలకు ఒకే చెబుతోంది. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా పని చేయడం గొప్ప విషయమంటున్నారు బీజేపీ నేతలు.