ఫ్రమ్ పాకిస్తాన్ : సౌదీ రాజుకి మోడీ ఘనస్వాగతం

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 04:59 AM IST
ఫ్రమ్ పాకిస్తాన్ : సౌదీ రాజుకి మోడీ ఘనస్వాగతం

 

ఓవైపు పుల్వామా ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోతున్న సమయంలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. పాకిస్థాన్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం రాత్రి భారత్‌లో అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. సౌదీ రాజు సల్మాన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఆయనతోపాటు సౌదీ రక్షణమంత్రి, సౌదీ విదేశాంగ మంత్రి, అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు భారత్ కు వచ్చారు.

పుల్వామా దాడి ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తొలగించడానికి సౌదీ ప్రయత్నించే అవకాశం ఉంది. సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో భారత్ ఒకటి. ఇండియా సహా 8 దేశాలతో భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సౌదీ భావిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) ప్రధాని మోదీ, సౌదీ రాజు భేటీ అనంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, సౌదీ అరేబియాల తరుఫున వారు ప్రపంచానికి గట్టి సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.  ఇదే సమయంలో సౌదీ విదేశాంగ మంత్రి జుబేయిర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ ల మధ్య ఉన్న సమస్యలను, ఉద్రిక్తలను పరిష్కరించేందుకు సౌదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. తాము వేసే మార్గం మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

 

అయితే మరోవైపు పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత.. రెండు రోజులపాటు పాకిస్తాన్‌లో పర్యటించిన సౌదీ రాజు సల్మాన్.. ఆ దేశంలో 20 బిలియన్ డాలర్లను డొనేట్ చేశారు. అంతేకాదు గత అక్టోబర్‌లో పాకిస్తాన్ కు సౌదీ 6 బిలియన్ డాలర్ల రుణం అందజేసింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ అందుకు ప్రతిగా సల్మాన్‌కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషానె పాకిస్థాన్‌’ను కట్టబెట్టింది. భారత్ పర్యటన ముగిసిన తర్వాత సౌదీ రాజు చైనా వెళ్లనున్నారు. అక్కడి నుండి ఆయన మలేషియా, ఇండోనేషియాకు కూడా వెళ్లనున్నారు.