6 నెలలకు సరిపడా రేషన్ తో ఢిల్లీకి రైతులు

రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ కన్నీటి ప్రసంగం తమను కదిలించింది హర్యాణా రైతులు తెలిపారు. రాకేశ్ టికాయత్ భావోద్వేగ ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రైతులను చైతన్యపరిచిందని, స్ఫూర్తి నింపిందని .. ఆందోళనలకు మద్దతుగా ఢిల్లీ సరిహద్దులకు తరలి వెళ్తున్నట్టు వారు తెలిపారు. హర్యాణాలోని అనేక జిల్లాల నుంచి రైతులు ఢిల్లీకి పయనమయ్యారు.
హిసార్ జిల్లాలోని నార్నంద్, రాజ్‌తల్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు కనీసం 6 నెలలకు సరిపడా ఆహార సామగ్రితో దిల్లీ సరిహద్దులకు బయలుదేరారు. రైతు ఉద్యమాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అయితే ఈ కుట్రలకు రైతులు భయపడరని… వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
గురువారం సాయంత్రం ఘజియాబాద్ జిల్లాలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద హై డ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద ఆందోళన విరమించాలని యూపీలోని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం (జనవరి 28) అర్ధరాత్రి వరకు గడువు విధించారు. ఒకవేళ రైతులు ఖాళీ చేయకపోతే తామే బలవంతంగా ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. అయితే,ఆందోళనలను విరమించే ప్రసక్తి లేదని..బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకోవడానికైనా సిద్ధమని కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. బీజేపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులపై దాడి చేయొద్దంటూ రాకేశ్ టికాయత్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక,ఆ రాత్రే అక్కడ మోహరించిన పెద్ద సంఖ్యలో బలగాలను ఉపసంహరించారు పోలీస్ అధికారులు.