రైతుల పోరాటం ముగియనుందా : మరో రెండు సంఘాల ఆందోళన విరమణ

Jan 26 violence : గత రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఇక ముగియనుందా? ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైతు సంఘాల్లో చీలికలు వచ్చాయి. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా…ఆందోళన విరమిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (లోక్ శక్తి), కిసాన్ మహా పంచాయత్ లు ప్రకటించాయి.
దీంతో ఇప్పటి వరకు నాలుగు రైతు సంఘాలు ఆందోళన విరమించాయి. ఘజిపూర్ సరిహద్దును ఖాళీ చేయాలని రైతులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2021, జనవరి 28వ తేదీ గురువారం రాత్రి వరకు సరిహద్దు నుంచి వెళ్లిపోవాలని ఆదేశాల్లో వెల్లడించారు. ఖాళీ చేయకపోతే..బలవంతంగా.. చేయిస్తామని ప్రకటించారు. ఘజిపూర్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
మరోవైపు…కిసాన్ గణతంత్ర పరేడ్ లో హింసపై రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఘజిపూర్ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఢిల్లీ పోలీసులు మూడు పేజీల నోటీసుల్లో 11 అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ యుపి ఘజిపూర్ సరిహద్ధులోని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు.
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేపడుతున్నారు. ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారడం.. ఎర్రకోటపై మరో జెండా ఎగురవేయడం లాంటి పరిస్థితులతో.. తాము ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు పలు సంఘాలు వెల్లడిస్తున్నాయి. అనుకున్న సమయం కంటే ముందే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించడం, ముందు నిర్దేశించిన రూట్‌లో కాకుండా.. ర్యాలీని ఇతర మార్గంలో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని AIKSCC కన్వీనర్ వీఎం సింగ్ మరో నేత రాకేశ్ టికాయత్‌ను ప్రశ్నించారు.
ఎర్రకోట వద్ద భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎండగట్టారు. టెంట్లు తీసేసి చిల్లా సరిహద్దులను రైతులు ఖాళీ చేశారు. నిన్నటిదాకా రైతుల ఆందోళనలతో నిండిపోయిన ప్రాంతమంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. పోలీసుల బారికేడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో యూపీ-నోయిడా నుంచి ఢిల్లీ వైపు రాకపోకలు అనుమతిస్తున్నారు. టిక్రి సరిహద్దుల్లో మాత్రం రైతుల ఆందోళన కొనసాగుతోంది. ట్రాక్టర్ ర్యాలీ విధ్వంస ఘటనలపై కేంద్ర హోంశాఖ రివ్యూ జరిపింది. ఐబీ చీఫ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం కాకుండా ఇతర జెండాలు ఎగురవేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని ఢిల్లీ పోలీసులకు కేంద్రం ఆదేశించింది.