లక్ష రూపాయల పంట నష్టపోతే, పరిహారంగా ఒక్క రూపాయి ఇచ్చిన ప్రభుత్వం.. ఓ రైతు దీనగాథ

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 01:42 PM IST
లక్ష రూపాయల పంట నష్టపోతే, పరిహారంగా ఒక్క రూపాయి ఇచ్చిన ప్రభుత్వం.. ఓ రైతు దీనగాథ

Updated On : September 21, 2020 / 1:59 PM IST

దేశంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతుల గోడు పట్టించునే వారు లేరు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వారే కానీ, ఏ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడం లేదు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతే, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కడుపు నిండా తిండి తినే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ రైతుకి ప్రభుత్వం నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆ రైతు లక్ష రూపాయల విలువైన పంట కోల్పోయాడు. నష్టపరిహారం కింద ప్రభుత్వం అతడికి ఇన్సూరెన్స్ ఇచ్చింది. అదీ కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇచ్చింది. ఒక్క రూపాయిని ఆ రైతు బ్యాంకు ఖాతాలో వేసింది.

బేతుల్‌లో పురన్ లాల్ అనే రైతుకి ఈ దుస్థితి ఎదురైంది. ఆ రైతుకి రెండున్నర హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. అందులో పంట వేశాడు. కాగా లక్ష రూపాయల నష్టం వచ్చింది. దీంతో ఆ రైతు తనను ఆదుకోవాలని కోరుతూ ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.

ఇందుకుగాను ప్రభుత్వం ఆ రైతు బ్యాంకు ఖాతాలోకి కేవలం ఒక్క రూపాయి మాత్రమే వేసింది. దీంతో ఆ రైతు షాక్ తిన్నాడు. లక్ష రూపాయలు నష్టపోతే రూపాయి ఇవ్వడం ఏంటని వాపోయాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. మరో ఇద్దరు రైతులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ రైతుకి రూ.70, మరో రైతుకి రూ.92 పరిహారంగా అందింది.

దీనిపై స్పందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు నిరాకరించారు. కాగా రూ.200 కన్నా తక్కువ బీమా వచ్చిన రైతుల పేర్లను తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీలకు రివ్యూ కోసం పంపిస్తామన్నారు. ఈ వ్యవహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మొత్తం 64వేల 893 మంది రైతులు..నష్టపరిహారంగా పంట బీమా కింద 81.71 కోట్లు అందుకున్నారు. కాగా, చాలామంది రైతులు ఖాతాల్లో స్వల్పమైన నగదు మాత్రమే పడింది.