కల్నల్ సోఫియా ఖురేషీకి మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా క్షమాపణలు.. ఏమన్నారంటే?
ఈ పరిణామాలతో సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెబుతూ విజయ్ షా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

కల్నల్ సోఫియా ఖురేషీకి మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా క్షమాపణలు చెప్పారు. పాకిస్థాన్, పీవోకేలో భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” సమయంలో ఇండియా చేసిన దాడులకు సంబంధించిన వివరాలను సోఫియా ఖురేషీ వివరించిన విషయం తెలిసిందే.
దీంతో ఆమె గురించి దేశ ప్రజలకు మరింత తెలిసింది. అయితే, ఆమెపై ఇటీవల మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద కామెంట్లు చేశారు. సోఫియా ఖురేషీ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పహల్గాంలో ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేశారని, దీంతో ఉగ్రవాదుల కమ్యూనిటీకే చెందిన సోదరిని సైనిక విమానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపి, గుణపాఠం చెప్పించారని అన్నారు.
దీంతో మంత్రి విజయ్ షాపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. విజయ్ షా కామెంట్స్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా తీసుకుని ఈ విచారణ చేపట్టింది. చివరకు, ఈ వ్యవహారంలో విజయ్ షాపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని చెప్పింది. విజయ్ షా కామెంట్లను జాతీయ మహిళా కమిషన్ కూడా ఖండించింది.
ఈ పరిణామాలతో సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెబుతూ విజయ్ షా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నానని, అలాగే, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మన దేశ సోదరి సోఫియా ఖురేషీ దేశం కోసం తన బాధ్యతలను కులమతాలకు అతీతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు.