ముంబాయిలో గర్భిణీలకు కరోనా..పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 10:46 AM IST
ముంబాయిలో గర్భిణీలకు కరోనా..పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు

Updated On : May 21, 2020 / 10:46 AM IST

ముంబయి నగరమంతా కరోనా వైరస్ దెబ్బకి  అతలాకుతలమైంది. అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు చాలా ఎక్కువగా నమోదు అయ్యాయి. ముంబయిలో మాత్రమే 24వేల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో 840 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు బాధపడాల్సిన విషయమేంటంటే.. వందల మంది గర్భిణులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి జాగ్రత్తగా చికిత్స అందించారు. 

అదృష్టవశాత్తు గర్భిణుల్లో చాలా మంది పిల్లలని కన్నారు. కొందరికి సిజేరియన్‌ చేయగా, మరికొందరికి నార్మల్ డెలివరీ అయింది. పుట్టబోయే పిల్లలకు కరోనా లేదని తేలడంతో వారి తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. ముంబయిలో మాత్రమే 100కు పైగా గర్భిణులకు కరోనా సోకింది. వారంతా లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా సోకిన గర్భిణులు గతనెల రోజుల నుంచి 115 మంది పిల్లలకు జన్మనిచ్చారు. గర్భిణులకు పుట్టిన పిల్లల్లో 56 మంది మగ పిల్లలు, 59 మంది ఆడబిడ్డలు ఉన్నారు. అయితే అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికి..  మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది.    

ఈ గర్భిణులకు 65 మంది డాక్టర్లు, సుమారు 24 మంది నర్సులు వైద్య సేవలు అందించారు. లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రిలోని 40 బెడ్ల వార్డులో వీరికి చికిత్స అందించారు. ప్రెగ్నెంట్‌ మహిళల కోసం అదనంగా 34 బెడ్లను అందుబాటులో ఉంచారు. అయితే గర్భిణుల్లో చాలామందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పటికీ వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు.

కొందరూ జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు.  గర్భిణులకు డెలివరీ జరిగిన తర్వాత వారిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి.. మరోసారి జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేసి వారిని వారి నివాసాలకు పంపించామని చెప్పారు. వారం రోజుల తర్వాత మళ్లీ క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పారు.