Panipuri Sellor Son: హ్యాట్సాఫ్.. పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత.. ఒకప్పుడు ఫెయిల్, ఇప్పుడు ఏకంగా ఐఐటీలో సీటు..

విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. వైఫల్యాలతో కుంగిపోవద్దు.

Panipuri Sellor Son: హ్యాట్సాఫ్.. పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత.. ఒకప్పుడు ఫెయిల్, ఇప్పుడు ఏకంగా ఐఐటీలో సీటు..

Updated On : July 2, 2025 / 8:15 PM IST

Panipuri Sellor Son: కృషి, పట్టుదల, శ్రమ, సాధన ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటారు. మనపై మనకు నమ్మకం ఉంటే సక్సెస్ ఖాయం. చదువులో అయినా, బిజినెస్ లో అయినా జాబ్ లో అయినా.. కష్టపడితే అనుకున్నది సాధించడం పక్కా. ఇందుకు నిదర్శనమే ఈ పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు. 11వ క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన అతడు నిరాశ చెందలేదు, కుంగిపోలేదు. మరింత కష్టపడి చదివాడు. తన డ్రీమ్ ని నెరవేర్చుకున్నడు. ఐఐటీలో సీటు సాధించాడు. అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

ముంబైకి చెందిన హర్ష్ గుప్తా అంకితభావంతో ముందుకు సాగాడు. 11వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా.. మరోసారి పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. 12వ తరగతిలో కూడా మంచి మార్కులు సాధించాడు. అంతేకాదు.. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో సీటు సాధించాడు.

హర్ష్ గుప్తా(19) తండ్రి ఓ సాధారణ పానీ పూరి విక్రేత. ముంబై మెట్రోపాలిటన్ నగరం కళ్యాణ్‌లో నివాసం ఉంటాడు. ఐఐటీలో సీటు సాధించాలని హర్ష్ గుప్తా లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజస్థాన్‌ కోటాలోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. కష్టపడి చదివాడు. అనుకున్నది సాధించాడు. ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హర్ష్ గుప్తా తెలిపాడు.

JEE-మెయిన్స్‌లో 98.59% స్కోర్ చేసి JEE-అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించాడు గుప్తా. కానీ, అతనికి నచ్చిన కాలేజీ రాలేదు. అతను IIT లో సీటు లక్ష్యంగా పెట్టుకున్నాడు. మళ్ళీ ప్రయత్నించాడు. తన రెండవ ప్రయత్నంలో కోరుకున్న సీటును పొందాడు.

”11వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత నేను కోటాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబం నాకు మద్దతిచ్చింది. ఐఐటీ ముంబై లేదా రూర్కీలో సీటు సాధించాలని కలలు కన్నాను. బాగా చదువుకోమని నా తండ్రి నన్ను ప్రోత్సహించారు. నేను ఎలాగూ చదువుకోలేకపోయాను. నా కలలను నువ్వు నెరవేర్చాలి” అని తన తండ్రి తనతో చెప్పేవారని హర్ష్ గుప్తా చెప్పాడు.

”విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. వైఫల్యాలతో కుంగిపోవద్దు. నేను 11వ తరగతిలో విఫలమైనప్పటికీ, నేను ఎప్పుడూ నా లక్ష్యాన్ని వదులుకోలేదు. నా కుటుంబంలో, నా స్కూల్ లో నేనే మొదటి ఐఐటీ విద్యార్థిని” అని హర్ష్ గుప్తా తెలిపాడు.