ముస్లిం జంట పెళ్లి విందు.. అదే వేదికపై హిందూ జంట పెళ్లి.. ఎందుకిలా జరిగిందంటే?
ఆ తర్వాత ఒకే వేదికపై ఆ హిందూ, ముస్లిం జంటలు ఫొటోలు కూడా దిగాయి.

సంస్కృతి కవాడే అనే యువతితో నరేంద్ర గాలండే అనే యువకుడికి ఓ మైదానంలో పెళ్లి జరుగుతోంది. వివాహానికి సంబంధించిన సగం తంతు ముగిసింది. మైదానంలో పెళ్లి పందిరి మాత్రమే వేశారు. టెంట్లు వంటివి వేయలేదు. ఇంతలో జోరుగా వానపడింది.
పెళ్లికి వచ్చిన అతిథులు అంతా పరుగులు తీశారు. పెళ్లి మండపం మొత్తం తడిచి ముద్దయింది. పెళ్లి జరుగుతున్న వేళ వరుణుడు అడ్డం రావడంతో ఆ కుటుంబానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో అక్కడికి దగ్గరలో ఉన్న పంక్షన్ హాల్‌లో మహీన్, మొహ్సిన్ కాజీ అనే ఓ ముస్లిం జంట పెళ్లి విందు జరుగుతోందన్న విషయం వారికి గుర్తుకు వచ్చింది.
ఆ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి తమకు అందులో కాసేపు కొంత స్థలం ఇవ్వాలని మిగిలిన పెళ్లి తంతు కొనసాగిస్తామని ఆ ముస్లిం కుటుంబానికి హిందూ కుటుంబం విజ్ఞప్తి చేసింది. దీంతో పంక్షన్ హాల్‌లో హిందూ జంట పెళ్లిని కొనసాగించుకోవడానికి ముస్లింలు అనుమతి ఇచ్చారు.
వేదికను కూడా వాడుకోవచ్చని చెప్పారు. దీంతో సంస్కృతి కవాడే, నరేంద్ర గాలండే పెళ్లిలో తంతులో భాగంగా అక్కడే ఏడడుగులు వేసి మిగిలిన ఆచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత ఒకే వేదికపై ఆ హిందూ, ముస్లిం జంటలు ఫొటోలు కూడా దిగాయి. అనంతరం హిందూ, ముస్లిం కుటుంబాలు కలిసి భోజనాలు కూడా చేశారు. మహారాష్ట్రలోని పుణేలో ఈ ఘటన చోటుచేసుకుంది.