నందిగ్రామ్ EVMలకు ఫోరెన్సిక్ టెస్ట్ లు చేయాలి..గవర్నర్ తో భేటీ కానున్న మమత

Nandigram Official Claims His Life In Danger Says Mamata Banerjee
MAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం తర్వాత సోమవారం సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. నందిగ్రామ్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై… ఒకవేళ తాను రీకౌంటింగ్‌కు ఒప్పుకుంటే తన ప్రాణానికే ప్రమాదముందని నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారి ఎవరికో లేఖ రాసినట్లు నాకు ఒకరు ఎస్ఎంఎస్ పంపారు. నాలుగు గంటల పాటు సర్వర్ డౌన్ అయింది. గవర్నర్ కూడా నాకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ సడెన్‌గా ఫలితం మారిపోయింది అని మమత అన్నారు. ఈ సందర్భంగా ఓ ఆడియోను కూడా ఆమె వినిపించారు.
నందిగ్రామ్ లో ఈవీఎంలకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయాలని మమత డిమాండ్ చేశారు. ఇక, ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కేంద్ర బలగాలు తమను ఎంతో చిత్రహింసలకు గురిచేశాయని, అయినప్పటికీ తాము శాంతియుతంగానే కొనసాగామని వెల్లడించారు. ఎవరూ హింసకు పాల్పడకూడదని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆమె కోరారు. ప్రస్తుతం కొవిడ్‌పైనే తమ దృష్టంతా ఉందని, ఈ మహమ్మారిపైనే తమ పోరాటమని మమత పదే పదే చెప్పారు.
దేశం మొత్తం ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని, దీని కోసం రూ.30 వేల కోట్ల కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని మమత కోరారు. కేవలం 2,3 రాష్ట్రాలకే కేంద్రం వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ను ఎక్కువగా పంపిణీ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఇక రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ కొవిడ్ వారియర్లుగా గుర్తిస్తున్నట్లు ఈ సందర్భంగా మమత స్పష్టం చేశారు. కాగా,ఈరోజు సాయంత్రం 7 గంటలకు మమతాబెనర్జీ గవర్నర్ ని కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని ఈ సమావేశంలో మమత గవర్నర్ ని కోరనున్నట్లు సమాచారం.