జవాన్లకు కొత్త బాలిస్టిక్ హెల్మెట్లు

సైనికుల వ్యక్తిగత రక్షణను పెంచే దిశగా భారత్ సైన్యం మరో ముందడుగు వేసింది. ఒక లక్ష AK- 47 రక్షిత హెల్మెట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణలలో ఈ ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్ల సేకరణ ఒకటిగా నిలిచింది. ఒక్కో బాలిస్టిక్ హెల్మెట్‌కు రూ .50 వేలు ఖర్చవుతుందని సమాచారం. మొత్తంమీద ఆర్మీ రూ. 500 కోట్ల వ్యయంతో హెల్మెట్లను ఆర్డర్ ఇవ్వనున్నట్లుగా సమాచారం.
జూన్ 23 న దేశీయ, ప్రపంచ హెల్మెట్ తయారీదారులకు సైన్యం పదాతిదళ డైరెక్టరేట్ సమాచార అభ్యర్థన (ఆర్ఎఫ్ఐ)ను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించారు. జూలై 13 న సైతం ఢిల్లీలో పలువురి హెల్మెట్ తయారీదారులతో డైరెక్టరేట్ ప్రాథమిక సమావేశం నిర్వహించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదనల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు.
1990ల నుండి సేవలో ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ పట్కా స్థానంలో, అదేవిధంగా 2018 లో కాన్పూర్‌కు చెందిన ఎంకేయూ సరఫరా చేసిన స్టాప్‌గాప్ హెల్మెట్ల స్థానంలో ఈ నూతన హెల్మెట్లను ప్రవేశపెట్టనున్నారు. ఏకే 47 బుల్లెట్ల ప్రభావాన్ని 10 జౌల్స్ కంటే తక్కువకు తగ్గించగల సామార్థ్యం ఈ బాలిస్టిక్ హెల్మెట్ల రూపకల్పన.
కొత్త హెల్మెట్లు నైట్-విజన్ గాగుల్స్, టార్చ్, విజర్స్, ఫేస్ షీల్డ్స్ వంటి వివిధ ఉపకరణాలకు మద్దతు ఇచ్చేవిధంగా ఉండాలని సైన్యం పేర్కొంది. మరీ ముఖ్యంగా 10 మీటర్ల దూరం నుంచి వచ్చే ఎకె -47 రైఫిల్ 7.62 × 39 మిమీ మైల్డ్ స్టీల్ కోర్, హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్ల నుండి రక్షించడానికి కొత్త హెల్మెట్లు ఉండేలా ఆర్మీ కోరింది.