మాతృభాషతోనే విద్యార్థుల్లో వికాసం..కొత్త భారతదేశానికి “నూతన విద్యా విధానం”పునాది

పిల్లల ఇంటి భాష, పాఠశాలలో నేర్చుకునే భాష ఒకేలా ఉండాలని, తద్వారా పిల్లలు సులభంగా నేర్చుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రస్తుతం, ఐదవ తరగతి వరకు పిల్లలకు ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. దేశ నూతన జాతీయ విద్యా విధానంపై ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ఇవాళ(అగస్టు-7,2020) కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు.
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని మోడీ తెలిపారు. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చని, పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం సాయం చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానంతో విస్తృత ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 30 ఏళ్ల తర్వాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకువస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.
మూడు, నాలుగు సంవత్సరాలుగా మేధావుల సూచనలు, అధ్యయనం అనంతరం కొత్త విద్యా విధానం ఆమోదించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేడు ఈ విద్యా విధానాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని అన్నారు, ఎందుకంటే ఇందులో ఏకపక్షంగా ఏమీ లేదని. ఇంత పెద్ద సంస్కరణ ఎలా అమలు చేయనున్నారని ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
నూతన విద్యావిధానం అమలు చేయడానికి మీకు ఏమైనా సహాయం అవసరమైతే, నేను మీతో ఉన్నాను అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చామని, దేశ భవిష్యత్ కోసమే నూతన విద్యా విధానమని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానంపై ఆందోళన వద్దని.. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.
ఈ విధానం కొత్త భారతదేశానికి పునాది వేస్తుందని, దేశాన్ని బలంగా మార్చాలంటే పౌరులను శక్తివంతం చేయడానికి మంచి విద్య అవసరమని ప్రధాని అన్నారు.యువతలో విద్యా నైపుణ్యాలు పెంపొందించాలి. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలి. సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదు. పిల్లల్లో మనోవికాసం పెంచే సిలబస్ మాత్రమే ఉండాలని ప్రధాని తెలిపారు. జాతి నిర్మాణంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
మన దేశంలో విద్యా విధానం చాలా దశాబ్దాలుగా మారలేదని, డాక్టర్-ఇంజనీర్-లాయర్ లాంటి వృత్తులకు మాత్రమే పోటీ ఉందని గుర్తు చేశారు. నూతన విద్యావిధానంతో ఇప్పుడు యువత సృజనాత్మక ఆలోచనలను కొనసాగించగలుగుతారన్నారు. నూతన విధానం యువతకు వారి కలలను నెరవేర్చడానికి అవకాశం ఇస్తుందన్నారు. మన విద్యా విధానం యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు.
కొత్త విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు పలు ప్రశ్నలు ముందు వరుసలో నిలిచాయన్నారు. నేడు ప్రపంచంలో ఒక కొత్త వ్యవస్థ నిలబడి ఉంది, అటువంటి పరిస్థితిలో విద్యావ్యవస్థలో మార్పు అవసరం. ఇప్పుడు 10 + 2 కూడా రద్దు చేశామన్నారు. విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ మారడంతో పాటు తమ మూలాలతో అనుసంధానం చేసేలా విద్యావిధానం ఉందన్నారు.