Nipah Virus: కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి
కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.

Nipah Virus
Nipah Virus: కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం (సెప్టెంబర్ 5, 2021) తెల్లవారుజామున బాలుడు మృతి చెందాడు. ఓవైపు రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలోనే నిఫా వైరస్ ఓ ప్రాణాన్ని బలిగొనడం ఆందోళనకు గురి చేస్తోంది.
రెండు రోజుల క్రితం బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. నిఫా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. బాలుడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. వాటిని పరిశీలించిన నిపుణులు.. ఆ బాలుడి శరీరంలో నిఫా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఆ బాలుడిని మొదట ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే బాలుడి కుటుంసభ్యుల్లో ఎవరికీ లక్షణాలు లేవు. ఇక బాలుడితో కాంటాక్ట్ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. వారందరినీ ఐసోలేషన్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 30 మందిని ఇప్పటివరకు అబ్జర్వేషన్‌లో ఉంచారు.
Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..
నిఫా కలకలంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ మాట్లాడారు. ‘కోజికోడ్‌లోని సంబంధిత అధికారులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులతో చర్చించాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కాంటాక్ట్, ట్రేసింగ్, ఇతర పాత పద్దతులన్నీ ఇప్పటికే మొదలుపెట్టాం. జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమించాం’ అని తెలిపారు. ఇప్పటికైతే ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. మరోవైపు నిఫా కలకలంతో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరపున ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది.
తాజా కేసుకు సంబంధించి అనుసరించాల్సిన జాగ్రత్తలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. బాధిత బాలుడి కుటుంబం, గ్రామం, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఫా ఆనవాళ్లు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సూచించింది. బాధిత బాలుడితో గత 12 రోజుల్లో కాంటాక్ట్ అయినవారిని గుర్తించాలంది. ఆ కాంటాక్ట్స్‌ను క్వారంటైన్‌లో ఉంచాలని సూచించింది.
WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!
నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఇది పందులు, కుక్కలు, గుర్రాలు ఇతర జంతువులకు సోకుతుంది. మనుషులకు సోకితే… వైరస్ లోడ్ ఎక్కువైతే మరణం సంభవిస్తుంది. కేరళలో 2018 జూన్‌లో తొలిసారి నిఫా వైరస్ వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్థారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2019లోనూ మరోసారి ఒకరిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి
అడ్డుకట్ట పడింది. తాజాగా నిఫా వైరస్ బారిన పడి బాలుడు చనిపోవడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది.