నిర్భయ కేసులో కీలక తీర్పు…జనవరి22నే దోషులకు ఉరి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ అయింది. 2వేల 582 రోజుల తర్వాత నిర్భయకు న్యాయం జరిగింది. మంగళవారం(జనవరి-7,2020)పటియాలా కోర్టు ఈ కేసులోని నలుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి-22 ఉదయం 7గంటలకు దోషలను ఉరితీయనున్నారు.
తేదీని ఖరారు చేసే ముందు న్యాయమూర్తి దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తుది విడతగా వారేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పటియాలా కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని వినియోగించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. దోషులు నలుగురికి ఓకే రోజు, ఓకే సారి ఉరి శిక్ష అమలంటూ డెత్ సెంటెన్స్ జారీ చేశారు పటియాలా కోర్టు న్యాయమూర్తి. డెత్ వారెంట్ పై అప్పీలు చేసుకునేందుకు నిందితులకు 14రోజుల గడువు ఇచ్చింది కోర్టు. పటియాలా కోర్టు ఇష్యూ చేసిన డెత్ వారెంట్ పై నిందితులు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా నిందితులకు ఉంది.
నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలులో జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ పాటియాలా కోర్టును గత డిసెంబర్ లో ఆశ్రయించిన విషయం తెలిసిందే.దోషులకు డెత్ వారెంట్ ఇవ్వాలని నిర్భయ తల్లిదండ్రుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించిన సమయంలో ఈ మేరకు కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. పటియాలా కోర్టు తీర్పు తర్వాత నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఏడేళ్ల తమ న్యాయ పోరాటం ఫలించిందన్నారు. ఇది దేశం సాధించిన విజయం అని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెంచుతుందని ఆశాదేవి తెలిపారు. మరోవైపు నలుగురు దోషులను ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా నలుగురిని ఒకేసారి ఉరితీయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో తమకు విధించిన శిక్షను పున:సమీక్ష చేయాలంటూ దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ వేసిన పిటిషన్ ను గత నెలలో సుప్రీం కొట్టేవేసిన విషయం తేలిసిందే.
దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.