మోడీతో సమావేశమైన నిర్మలా…వలస కూలీల కోసం ప్రత్యేక ప్యాకేజీ!

  • Published By: venkaiahnaidu ,Published On : April 16, 2020 / 07:58 AM IST
మోడీతో సమావేశమైన నిర్మలా…వలస కూలీల కోసం ప్రత్యేక ప్యాకేజీ!

Updated On : April 16, 2020 / 7:58 AM IST

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇవాళ(ఏప్రిల్-16,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా పూర్తిస్థాయిలో పలు రంగాలు పనిచేయకపోవడం వల్ల ప్రస్తుతం నెలకొన్నఎకానమీ స్థితిగతులపై మోడీతో ఆమె చర్చించారు.

పలు రంగాలకు,ముఖ్యంగా వలస కార్మికులకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే విషయంపై మోడీ,నిర్మలా సీతారమన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో వలసకూలీలది సమస్యగా మారింది. ఉపాధి కరవు కావడంతో వారు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తొలిదశ లాక్‌డౌన్ సమయంలో పేదల కోసం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం రెండోదశలో ఎంత ప్యాకేజీ ప్రకటిస్తుందనే విషయంపై అందరి దృష్టీ నెలకొంది.

లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికమంత్రిత్వశాఖ మరియు ప్రధానమంత్రి కార్యాలయం తరచుగా మీటింగ్స్ ను నిర్వహిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు తొలిదశ లాక్ డౌన్ కారణంగా భారత్ కు 7-8లక్షల కోట్ల వరకు నష్టం ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read | ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122