నిర్మల కీలక వ్యాఖ్యలు…ఆరేళ్లలో వేల మందికి పౌరసత్వం ఇచ్చాం

ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ…సీఏఏ ఉద్దేశ్యం పౌరసత్వం ఇవ్వడమే కానీ ఏ ఒక్కరి పౌరసత్వం తొలగించేది కాదని ఆమె అన్నారు. గడిచిన ఆరేళ్లలో 2,838 మంది పాకిస్థానీ శరణార్థులకు, 914 మంది ఆఫ్ఘనిస్థాన్ శరణార్థులకు, 172 మంది బంగ్లాదేశ్ శరణార్థులకు పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. వీరిలో ముస్లింలు కూడా ఉన్నట్లు తెలిపారు.
2014 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన 566 మంది ముస్లింలకు పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. 2016-18 మధ్య కాలంలో మోదీ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,595 మంది పాకిస్థానీ వలసదారులకు, 391 మంది ఆఫ్ఘనిస్థానీ ముస్లింలకు భారత పౌరసత్వం మంజూరు అయిందని ఆమె తెలిపారు.1964 నుంచి 2008 వరకు శ్రీలంక నుంచి వచ్చిన 4 లక్షల మంది తమిళులకు కూడా పౌరసత్వం మంజూరు చేసినట్లు చెప్పారు.
శ్రీలంక నుంచి మనదేశానికి వచ్చిన అనేకమంది శరణార్థులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. వారికి ప్రాథమిక సదుపాయాలు కూడా కరవవుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు వారి హక్కుల గురించి మాట్లాడటం లేదన్నారు. పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేయం అని పలు రాష్ట్రాలు చెప్పడాన్ని ఆమె ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాల్సిందేనన్నారు. కేరళ,పంజాబ్ అసెంబ్లీల్లో సీఏఏకు వ్యతిరేకంగా చేసిన తీర్మాణాలు చట్టవిరుద్ధమని అన్నారు.