NISAR Mission: ‘నిసార్’ ప్రయోగానికి రంగం సిద్ధ.. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే?

నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించింది.

NISAR Mission: ‘నిసార్’ ప్రయోగానికి రంగం సిద్ధ.. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే?

NISAR Mission

Updated On : July 21, 2025 / 9:52 AM IST

NISAR Mission Launch: నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించింది. ఈనెల 30వ తేదీ సాయంత్రం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

ఇస్రో శాస్త్రవేత్తలు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ లో రాకెట్ అనుసంధాన పనులను వేగంగా పూర్తిచేస్తున్నారు. వాస్తవానికి నిసార్ ఉపగ్రహ ప్రయోగం జూన్ నెలలోనే జరగాల్సి ఉంది. పీఎస్ఎల్వీ-సీ61 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగం వాయిదా పడింది.

నిసాన్ డ్యూయెల్ రాడార్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఎస్ బ్యాండ్ సిథటిక్ ఎపర్చర్ రాడార్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్‌ను నాసా రూపొందించాయి. ఈ రెండు రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిప్లెక్టర్ యాంటెన్నాను కలిగి ఉంటాయి. సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాంకేతికతను కలిగి ఉంది. ఇది మేఘాలను దాటిన తర్వాత కూడా సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టగలదు.
ఇదిలాఉంటే.. ఈ ప్రయోగంలో నాసా అందించిన ఇతర కీలక పరికరాలు.. ఇంజినీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా, సబ్ సిస్టమ్, హై-రేట్ స్పైన్స్ డౌన్ లింక్ వ్యవస్థ, జీపీఎస్ రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లు ఉన్నాయి.

నిసాన్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు మొత్తం భూమిని స్కాన్ చేస్తుంది. ప్రతి కదలిక లేదా మార్పును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో శాటిలైట్ ను రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శాటిలైట్ నుంచి పొందిన డేటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలకు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా లభించిన డేటాను ఎవరూ సులభంగా దొంగిలించలేని విధంగా నాసా దాన్ని క్లౌడ్ లో స్టోర్ చేస్తుంది.

నిసాన్ ఉపగ్రహం బరువు సుమారు 2,800 కిలోలు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయెల్- ఫ్రీక్వెన్సీ రాడార్​తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఆధునిక రాడార్ ఇమేజింగ్‌ ద్వారా అంతరిక్షం నుంచి ఇది భూ ఉపరితలాన్ని చాలా స్పష్టంగా చూడగలదు. సింపుల్​గా చెప్పాలంటే నిసార్ శాటిలైట్ ఎక్కడో ఆకాశం నుంచి సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టి దానిని 3డీ రూపంలో చూపిస్తుంది.

ప్రయోజనాలు ..
♦ నిసార్ ఉపగ్రహం నుంచి పొందే హైరిజల్యూషన్ డేటా ద్వారా భారతదేశ తీరప్రాంతాల పర్యవేక్షణ.
♦ డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పుల అధ్యయనం.
♦ సముద్రంపై మంచు కదలికల పరిశీలన.
♦ అంటార్కిటిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాలు పరిస్థితుల పర్యవేక్షణ.
♦ పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవవైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదల సహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ.
♦ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో, అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం.