Amir Khan Muttaqi: అఫ్ఘానిస్థాన్ మంత్రి ప్రెస్‌మీట్.. మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలు..
దీనిపై పురుష జర్నలిస్టులు స్పందించాల్సిందని, ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేసి నిరసన తెలిపి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

Amir Khan Muttaqi: అఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీడియాతో పలు అంశాలపై మాట్లడారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే వచ్చింది.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మహిళా జర్నలిస్టులకు ఇన్విటేషన్ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఇంకా లింగ వివక్ష చూపిస్తోందని భారత మహిళా జర్నలిస్టులు మండిపడుతున్నారు. దీనిపై పురుష జర్నలిస్టులు స్పందించాల్సిందని, ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేసి నిరసన తెలిపి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
కాగా, భారత పర్యటనకు వచ్చిన ముత్తాఖీ.. పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని స్పష్టం చేసిన ఆయన, శాంతి స్థాపన కోసం పాక్ కూడా తమ మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు. అంతేకాదు కాబూల్‌పై జరిగిన వైమానిక దాడుల వెనుక పాక్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
”మా దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నాం. ఇలాంటి విధానాలతో ఇరుదేశాల మధ్య సమస్యలు పరిష్కారం కావు. అఫ్గాన్ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు. మా నేల నుంచి ఇతర దేశాలపై దాడి చేసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వబోము” అని ముత్తాఖీ తేల్చి చెప్పారు.
“గత నాలుగేళ్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను అఫ్గాన్ గడ్డపై నుంచి పూర్తిగా ఏరివేశాం. ప్రస్తుతం దేశంలో ఒక్క ఉగ్రవాది కూడా లేడు. అంగుళం భూమి కూడా వారి ఆధీనంలో లేదు” అని ముత్తాకీ స్పష్టం చేశారు. శాంతి కోసం మేం చేసినట్లుగానే ఇతర దేశాలు కూడా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలి అంటూ పాక్ కు సూచించారు.