ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. అది మోడీ, షాలు చూడాలి : అసదుద్దీన్

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 04:56 AM IST
ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. అది మోడీ, షాలు చూడాలి : అసదుద్దీన్

Updated On : December 22, 2019 / 4:56 AM IST

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం MP అసదుద్దీన్ ఒవైసీ శనివారం (డిసెంబర్ 21)  భారీ బహిరంగ సభను నిర్వహించారు.  ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మనం భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎన్ఆర్సీ వల్లనేనని అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే భారతదేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మనం భారతీయులం..మనమంతా భారతదేశ పౌరులమని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. మన పిలుపులు ప్రధాని మోడీకి వినిపించాలని అసదుద్దీన్‌ పిలుపు నిచ్చారు. 

కేంద్ర ప్రభుత్వ తీసుకునే చర్యలు మహాత్మాగాంధీ..అంబేడ్కర్‌, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌లను అవమానిస్తునట్లుగా ఉన్నాయని అసదుద్దీన్ వివమర్శించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ వల్ల జరిగేది హిందూ-ముస్లిం, బీజేపీ-మజ్లిస్‌ మధ్య గొడవ కాదని..దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ భారత పౌరులందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. భారతదేశం నాదేశం..నా దేశం కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తానంటూ అసదుద్దీన్ ఎంతో ఉద్వేగంగా ప్రసంగించారు. గత పాలకులెవరూ దేశాన్ని మతం పేరుతో విభజించలేదని ఈ సందర్బంగా అసదుద్దీన్ గుర్తుచేశారు. 

భారత పౌరులమని నిరూపించుకోవాల్సిన దుస్థితి ఈ స్వతంత్ర్య భారతదేశంలో 70 ఏళ్లలో ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎన్‌ఆర్సీ వల్ల నష్టమే తప్ప.. ఎటువంటి ప్రయోజనం ఉండదని..దీని వల్ల రాష్ట్రాలకు రాష్ట్రాలే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. బీజేపీ ప్రజల్ని రెచ్చగొడుతోందని, ఎన్‌ఆర్సీ, సీఏఏ వ్యతిరేకత వ్యక్తంచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. దీనిపై ఆందోళనలో వ్యక్తంచేసే సమయంలో ఎక్కడా హింసకు తావు లేకుండా ముస్లింలంతా సమన్వయంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్నిఅవమానపరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు దేశంలోని అన్నివర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.