Anand Subramanian : ఎన్ఎస్ఈ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

NSE CEOగా చిత్రా రామకృష్ణ, ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రహ్మణియన్ ఉన్న కాలంలో NSEలో జరిగిన అవకతవకలపై సుదీర్ఘ దర్యాప్తు జరిపి సెబీ 190 పేజీల నివేదిక సమర్పించింది.

Anand Subramanian : ఎన్ఎస్ఈ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

Nse Case

Updated On : February 25, 2022 / 10:37 AM IST

Anand Subramanian arrest : నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెబీ నోటీస్‌ నంబర్ 6గా పేర్కొన్న ఆనంద్ సుబ్రహ్మణియన్‌ను సీబీఐ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణియన్ NSE మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్. NSE మాజీ సీఈవో చిత్ర రామకృష్ణతో కలిసి కో లొకేషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. NSE రహస్యాలను, కీలక రహస్యాలను అదృశ్యయోగికి చేరవేసినట్టు చిత్ర రామకృష్ణపై ఆరోపణలున్నాయి.

ఆ అదృశ్య యోగి..సుబ్రహ్మణియన్‌నేనా అన్న అనుమానాలూ ఉన్నాయి. సెబీ, సీబీఐ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో సుబ్రహ్మణియన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో అదృశ్యయోగి ఎవరో తేలిపోనుంది. NSE CEOగా చిత్రా రామకృష్ణ, ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రహ్మణియన్ ఉన్న కాలంలో NSEలో జరిగిన అవకతవకలపై సుదీర్ఘ దర్యాప్తు జరిపి సెబీ 190 పేజీల నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోనే చిత్ర అదృశ్య యోగి వ్యవహారం బయటికొచ్చింది.

Chitra Ramakrishna : ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఐటీ దాడులు

అదృశ్యయోగితో చిత్ర NSE విషయాలను చర్చించినట్టు.. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఆనంద్ సుబ్రహ్మణియన్‌కు పదోన్నతులు కల్పించినట్టు తేలింది. అదృశ్యయోగి, చిత్ర వ్యక్తిగత సంభాషణలకు సంబంధించిన మెయిళ్లు కూడా బయటకు వచ్చాయి. ఈ మొత్తం కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ చిత్ర రామకృష్ణకు, ఆనంద్‌ సుబ్రహ్మణియన్‌కు లుకౌట్ నోటీసులిచ్చింది. అదృశ్యయోగి ఎవరో తేల్చే పనిలో పడింది.

ఇటీవలే నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ విచారణలో యోగి అంశంపై సీబీఐ ప్రశ్నించింది. 12 గంటలపాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. NSEకి సంబంధించిన కీలక విషయాలను హిమాలయ యోగితో పంచుకున్నట్టు తేలిసింది. రహస్య సమచారాన్ని కూడా బాబాతో చిత్రా రామకృష్ణ చెప్పారని వెల్లడైంది. ఆర్థిక, పాలనపరమైన అంశాలను బాబాతో పంచుకున్నట్టు సీబీఐ గుర్తించింది.

Chitra Ramakrishna : చిత్రా రామకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడి

చెన్నైలోని చిత్రా నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలను కూడా సీబీఐ అధికారులు చిత్రా రామకృష్ణ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అజ్ఞాత యోగి ఎవరనే విషయంపై మార్కెట్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అజ్ఞాత యోగి బయట వ్యక్తే అంటున్నారు సెబీ అధికారులు. NSEలో పనిచేసే వ్యక్తే అజ్ఞాత యోగి అంటూ మరో వాదన బలంగా వినిపిస్తోంది. అటు ఆనంద్ సుబ్రమణియన్ అజ్ఞాత యోగి పేరుతో చిత్రను ట్రాప్ చేశారంటున్నారు.