Covishield Dose Gap Controversy : కోవిషీల్డ్ డోసుల వ్యవధి వివాదంపై స్పందించిన ఆరోగ్య మంత్రి
సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలను ప్రస్తుతం 12 నుంచి 16 వారాల తేడాలో ఇస్తున్న విషయం తెలిసిందే.

On Covishield Dose Gap Controversy Health Ministers Clarification
Covishield Dose Gap Controversy సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలను ప్రస్తుతం 12 నుంచి 16 వారాల తేడాలో ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో 4-6 వారాల మధ్య కోవిషీల్డ్ డోసులను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి అంశంపై ప్రస్తుతం వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం(జూన్-16,2021) దీనిపై వివరణ ఇచ్చారు. కోవీషీల్డ్ రెండు డోసుల టీకాల మధ్య వ్యవధిని పెంచడాన్ని ఆయన సమర్థించుకున్నారు. పారదర్శక పద్థతిలో సైంటిఫైక్ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్షవర్థన్ ఓ ట్వీట్‌లో తెలిపారు. వ్యాక్సినేషన్ డేటాను అంచనా వేసే సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. ఒక ముఖ్యమైన విషయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని హర్షవర్ధన్ అన్నారు. రెండు డోసుల కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడాన్ని ఎన్‌టీఏజీఐ(నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్) చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా ఓ ప్రకటనలో సమర్థించగా.. అరోరా వివరణను హర్షవర్థన్ తన ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.
బ్రిటన్ ఆరోగ్యశాఖ వెల్లడించిన డేటా ఆధారంగా కోవీషీల్డ్ టీకాలపై నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ అరోరా తెలిపారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 12 వారాలకు పెంచినప్పుడు వ్యాక్సిన్ సామర్థ్యం 65 శాతం నుంచి 88 శాతానికి పెరిగినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆల్ఫా వేరియంట్ ఉధృతంగా ఉన్న సమయంలో బ్రిటన్ చేపట్టిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. ఆ సమయంలో డోసుల మధ్య వ్యవధిని 12 వారాల ఉంచడం వల్ల ఆల్ఫా వేరియంట్‌ను సులువుగా ఎదుర్కొన్నట్లు బ్రిటన్ తన స్టడీలో తెలిపిందన్నారు. ఆ ఆలోచన బాగుందని, రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం వల్ల అడినోవెక్టర్ వ్యాక్సిన్ల ప్రతిస్పందన పెరుగుతందని గ్రహించినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచే అంశంలో కోవిడ్ వర్కింగ్ గ్రూపులో ఎటువంటి విభేదాలు తలెత్తలేదని అరోరా తెలిపారు.
ఇంగ్లండ్‌లో మొదట ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మద్య వ్యవధి 12 వారాలు అని, కానీ తాము మాత్రం నాలుగు వారాల వ్యవధి సరిపోతుందని భావించినట్లు అరోరా తెలిపారు. కానీ తర్వాత జరిగిన అధ్యయనాల ఆధారంగా టీకాను 4 వారాల వ్యవధిలో ఇస్తే దాని సామర్థ్యం 57 శాతం ఉందని, ఇక 8 వారాల వ్యవధిలో ఇస్తే దాని సామర్థ్యం 60 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. కెనడా, శ్రీలంక దేశాలు కూడా 12 నుంచి 16 వారాల వ్యవధిని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల పంజాబ్ లో PGI చండీఘర్ నిర్వహించిన అధ్యయనంలో..కోవీషీల్డ్ ఒక డోసు తీసుకున్నా లేక రెండు డోసులు తీసుకున్నా.. దాని సామర్థ్యం 75 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. అంటే ఒక డోసు తీసుకున్నా ఎక్కువ శాతం రక్షణ ఉన్నట్లే అని గుర్తించామన్నారు. ఇక CMC వెల్లోర్ నిర్వహించిన అధ్యయనంలో.. తొలి డోసు కోవీషీల్డ్‌తో 61 శాతం రక్షణ, రెండు డోసులు తీసుకుంటే అది 65 శాతం ఉన్నట్లు గుర్తించారన్నారు. PGI,CMC రెండు అధ్యయనాల ప్రకారం.. ఒక డోసు తీసుకున్నవారిలో 4 శాతం ఇన్ఫెక్షన్, రెండో డోసులు తీసుకున్నవారిలో 5 శాతం ఇన్ఫెక్ష ఉన్నట్లు అరోరా తెలిపారు.