రామమందిరం భూమి పూజ : కల సాకారమైంది – అద్వానీ

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగే శంకుస్థాపన కార్యక్రమం కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం మధ్యాహ్నం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా…భూమి పూజ జరుగనుంది.
అయోధ్యలో రామ మందిర ఉద్యమంలో కీలక నేతలు పాల్గొన్నారు. అందులో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఒకరు. రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో ఉన్నారు. భూమి పూజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా..ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన కల సాకారమైన రోజు అని, ఎంతో సంతోషం కలుగుతోందన్నారు. రథయాత్ర ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించానన్నారు. రామమందిర నిర్మాణం తనతో సహా..భారతీయులందరికీ ఒక ఉద్వేగ పూరిత క్షణం. మందిర నిర్మాణం బీజేప కలగా ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో సామరస్య వాతావరణంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం శుభపరిణామమన్నారు.
ఇదే వాతావరణం భారతీయుల మధ్య కలకాలం నిలబడాలన్నారు. భారతీయ నాగరికత వారసత్వానికి రాముడు ఒక ఆదర్శం. రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలబడాలన్నారు. సుపరిపాలన, అందరికీ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యమే ఒక ఉదహారణగా చెప్పారు. రాముడి సద్గుణాలను అందరూ అలవర్చుకోవాలని అద్వానీ సూచించారు.