Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన మూడో విమానం
ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఆదివారం ఢిల్లీలో దిగింది. ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు....

Operation Ajay
Operation Ajay: ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఆదివారం ఢిల్లీలో దిగింది. ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భారతీయులందరికీ మంత్రి భారత జెండాలను అందజేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడుల తర్వాత ప్రారంభించిన ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఈ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.
Also Read : US Sends USS Eisenhower : ఇజ్రాయెల్ యుద్ధరంగంలోకి మరో అమెరికా విమాన వాహక నౌక
ఇజ్రాయెల్ నుంచి తమను తరలించినందుకు ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేం అక్కడ భయపడ్డాం. సర్కారు చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని ప్రయాణీకులు పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమానంలోని 197 మంది భారతీయులు భారత్ మాతా కీ జై, వందేమాతరం వంటి నినాదాలు చేసిన వీడియోను ట్వీట్ చేశారు.
#OperationAjay moves forward.
197 more passengers are coming back to India. pic.twitter.com/ZQ4sF0cZTE
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 14, 2023
ఇజ్రాయెల్ నుంచి మొదటి చార్టర్ విమానం గురువారం 212 మందిని తీసుకువచ్చింది. రెండో బ్యాచ్‌లో 235 మంది భారతీయులు తిరిగి వచ్చారు. ఇప్పటివరకు మొత్తం 918 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి వచ్చారు. ఇప్పటికీ ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు భారతదేశానికి తిరిగి వెళ్లాలనుకునేవారు అత్యవసరంగా జతచేసిన ప్రయాణ ఫారమ్‌ను పూర్తి చేయాలని రాయబార కార్యాలయం సూచించింది. భారత రాయబార కార్యాలయం ఆపరేషన్ అజయ్‌లో ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ట్రావెల్ స్లాట్లు కేటాయిస్తోంది.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులు తిరిగి వచ్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇజ్రాయెల్‌లో 18,000 మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ నిపుణులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు. హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌లో 1,300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ ఎదురు వైమానిక దాడుల్లో గాజాలో కనీసం 1,900 మంది మరణించారు.
Also Read :Telangana : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత