గొప్ప నాయకుడిని సొంత పార్టీ మర్చిపోవడం బాధాకరం

బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్‌కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆద్వానీ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ఇంతటి గొప్ప నాయకుడిని సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమని మోడీ,అమిత్ షాలపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
అద్వానీ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు పలికారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా, మాజీ ఉపప్రధానిగా, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య ఉండే మర్యాదలపై ఆద్వానీ చేసిన వ్యాఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయన అన్నట్లుగానే ఓ పార్టీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన వారంతా దేశద్రోహులు కారు. ఆయన వ్యాఖ్యల్ని మేం మనస్పూర్తిగా స్వాగతిస్తూనే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని మమత ట్వీట్ చేశారు.
రాజకీయంగా వ్యతిరేకించే వారిని ప్రత్యర్థులుగా చూశామే గానీ.. శత్రువులుగానో, దేశద్రోహులుగానో చూడలేదని అద్వానీ అన్నారు. కానీ మోడీజీ నేతృత్వంలో బీజేపీ సిద్ధాంతాలకు తూట్లు పడటమేగాక.. మారిపోయాయి కూడా. మోడీ జీ మీ ఢిల్లీ ప్రయాణంలో సాయం చేసిన వ్యక్తి(అద్వానీని ఉద్దేశిస్తూ) చెప్పేమాటలు వినండి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు.
అద్వానీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ఉన్నత విలువలు, రాజనీతి కలిగిన గొప్ప నేతలను ఆదర్శంగా తీసుకోవాలి కానీ.. పట్టించుకోకుండా ఉండొద్దు. వారు సిగ్గుపడేలా ప్రవర్తించకూడదు. వారి అనుభవాలను, సూచనలకు విలువ ఇవ్వకపోవడం అంటే వారిని అవమానించడమే.అద్వానీని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. కానీ సొంత పార్టీనే ఆయనను మర్చిపోవడం బాధాకరం’అని వాద్రా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దేశమే ముందు. ఆ తర్వాతే పార్టీ. ఆ తర్వాతే వ్యక్తి. వాక్ స్వాతంత్ర్యం, వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలు. గతం నుంచి నేర్చుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూడాలి.జాతీయ వాదం అంటే మన వైవిధ్యాలన్నిటినీ కాపాడుకుంటూ, భావప్రకటనా స్వేచ్ఛ కలిగి ఉంటూ, ప్రజాస్వామ్యం వారసత్వ పునాదుల్ని బలపరచటమే కానీ, మనతో విభేదించిన వారిని మన ప్రత్యర్థులను, శత్రువులలాగా చూడటం కాదు… దేశ ద్రోహులుగా ముద్ర వేయడం కాదు.రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారు అన్న మాటలు నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో మన పై దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, తన స్వార్ధం కోసం తన పార్టీని దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోంది.ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అదే విషయాన్ని అద్వానీ గారు సున్నితంగా చెప్పారు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.