Rakesh Tikait : ఓవైసీ-బీజేపీది మామ-మేనల్లుడి బంధం

హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rakesh Tikait : ఓవైసీ-బీజేపీది మామ-మేనల్లుడి బంధం

Tikait

Updated On : November 22, 2021 / 6:15 PM IST

Rakesh Tikait :  హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ,ఎన్ఆర్సీ రద్దుపై ఒవైసీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…అసదుద్దీన్‌, బీజేపీ పార్టీది మామా-మేనల్లుడి బంధమని విమర్శించారు రాకేశ్‌ టికాయత్‌. “ఒవైసీ తనకు ఏది కావాలన్నా బీజేపీని నేరుగా అడుగవచ్చు.. దీని గురించి ఆయన టీవీలో మాట్లాడకూడదు. ఆయన నేరుగా అడగొచ్చు”అని టికాయత్ అన్నారు. సోమవారం లక్నోలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు టికాయత్.

కాగా, ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో ఓ పబ్లిక్ ర్యాలీలో ఓవైసీ మాట్లాడుతూ… సీఏఏ, ఎన్‌ఆర్‌సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు చట్టాలను రద్దు చేయకపోతే నిరసన కారులు ఉత్తరప్రదేశ్ వీధులను మరో షాహీన్‌బాగ్‌గా మారుస్తారని హెచ్చరించారు. సీఏఏ రాజ్యాంగానికి విరుద్ధమని, బీజేపీ ప్రభుత్వం రెండు చట్టాలను రద్దు చేయాలన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా వందలాది మంది ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది కొవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ విధించిన అనంతరం ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.

ఇక,వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను..100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పలు స్థానిక పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే స్థానిక పార్టీలతో పొత్తు ఉంటుందా లేదా అన్నది కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు.

కాగా, దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని యూపీ ఎన్నికల బరిలో దిగుతోంది ఎంఐఎం. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా వాటా ఈ రెండు సామాజిక వర్గాలదే. వీరంతా సమాజ్​వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువగా నష్టపోయేది ఎస్పీనే.

ALSO READ Rajamouli to meet Pawankalyan: పవన్‌ను కలవనున్న రాజమౌళి.. నిజమేనా? రీజన్ ఇదేనా?