ఈ బిల్లుకు కాంగ్రెస్సే కారణం..లోక్ సభలో షా ఆగ్రహం

పౌరసత్వ సవరణ బిల్లు(CAB) ఇవాళ లోక్ సభ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. 293 సభ్యుల మద్దతుతో ఈ బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు కేంద్రహోంమంత్రి అమిత్ సా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు రాజ్యాంగం పేర్కొన్న సెక్యూలరిజానికి,సమానత్వపు సిద్ధాంతాలకు,ముస్లింలకు వ్యతిరేకమంటూ ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించిన అమిత్ షా…అసలు కాంగ్రెస్ దేశాన్ని మతాల ఆధారంగా విభజించకపోయి ఉంటే ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఈ బిల్లు .001శాతం కూడా దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కు ఈ బిల్లు విరుద్ధం కాదన్నారు. ఈ బిల్లుపై అర్థవంతమైన వివరణ ఇవ్వడం జరిగిందన్నారు.
పౌరసత్వ సవరణ బిల్లు ఆర్టికల్ 11, ఆర్టికల్ 14లను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే ఆ ఆరోపణలను షా కొట్టిపారేశారు. మతం ఆధారంగా ప్రభుత్వం చట్టాలను చేసేందుకు ఆర్టికల్ 14 అడ్డుకోదని షా అన్నారు. 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎలా పౌరసత్వాన్ని కల్పించారో షా తెలిపారు. మరి అప్పట్లో పాకిస్థాన్ వారికి ఎందుకు ఆ అర్హత కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.ఉగాండా నుంచి వచ్చిన వారికి కూడా గత ప్రభుత్వాలు పౌరసత్వం కల్పించాయన్నారు. రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆర్టికల్ 14 గుర్తుకు రాలేదా అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఇస్లాం మతాన్ని పాటిస్తున్నాయని, దేశ విభజన సమయంలో భారత్, పాక్‌లు మైనార్టీ రక్షణ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.