Harish Rana: దేశంలోనే తొలి కారుణ్య మరణం కేసు.. 13ఏళ్లు కోమాలో ఉన్న హరీశ్ రానా కన్నుమూత
పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్ట్ 20న హాస్టల్ భవనం 2వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.
Harish Rana: హరీశ్ రానా కన్నుమూశారు. సుమారు 13 ఏళ్లు కోమాలో ఉన్న ఘజియాబాద్‌కు చెందిన హరీశ్ రానా మంగళవారం తుది శ్వాస విడిచారు. హరీశ్ తల్లిదండ్రులు కారుణ్య మరణం కోసం విజ్ఞప్తి చేయగా సుప్రీంకోర్టు అందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు హరీశ్ కు క్రమంగా చికిత్స ఆపేశారు. ఈ క్రమంలో హరీశ్ మంగళవారం కన్నుమూశారు.
13ఏళ్లుగా కోమాలోనే..
హరీశ్ 13 ఏళ్లు కోమాలో ఉన్నారు. జీవచ్ఛవంలా మంచానికే పరిమితం అయ్యారు. దీంతో హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతిస్తూ సుప్రీంకోర్టు మార్చి 11న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో డాక్టర్లు హరీశ్ కు వైద్యం ఆపేశారు. క్రమంగా అతడి ఆరోగ్యం క్షీణింపజేసి మరణించేలా చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రానా (32) పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్ట్ 20న హాస్టల్ భవనం 2వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. కోమాలోకి వెళ్లిపోయాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. మెదడు గాయం కారణంగా అతను కోమాలోకి వెళ్ళాడు. లైఫ్ సపోర్ట్‌పై ఉంచి మంచానికే పరిమితం చేశారు. శ్వాస కోసం హరీశ్ కి ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్ అమర్చారు. అయితే, హరీశ్ ను ఆ స్థితిలో తల్లిదండ్రులు చూడలేకపోయారు. వారి హృదయం తల్లడిల్లిపోయింది. కన్న కొడుకు బాధను చూడలేక ఎన్నోసార్లు కంటతడి పెట్టారు. ఈ క్రమంలో హరీశ్ కు విముక్తి కలింగించాలని నిర్ణయించుకుని కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024 జూలైలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పలు కారణాలతో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.
ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు హరీశ్ తల్లిదండ్రులు. వైద్య నివేదికలు పరీశిలించిన సుప్రీం ధర్మాసనం 2026 జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో మాట్లాడింది. వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మానవీయకోణంలో మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో మార్చి 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి పర్మిషన్ ఇచ్చింది.
నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి అనుమతి పొందిన తొలి భారతీయుడి హరీశ్ రానా. అతని తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు లైఫ్ సపోర్ట్‌ను తొలగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన దాదాపు రెండు వారాల తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం 4గంటల 10 నిమిషాలకు హరీశ్ మరణించారని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. హరీష్ రాణాను కారుణ్య మరణ ప్రక్రియ కోసం మార్చి 14న ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల తర్వాత ఆయన లైఫ్ సపోర్ట్‌ను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. 11 రోజుల తర్వాత రాణా తుదిశ్వాస విడిచారు.
కాగా, ఇంత బాధలోనూ హరీశ్ రానా కుటుంబం ఆదర్శంగా నిలిచింది. హరీశ్ రెండు కార్నియాలు, గుండె కవాటాలతో సహా అతని కీలక కణజాలాలు, అవయవాలను దానం చేసింది.
