Air India Compensation: ఎయిరిండియా ప్రమాద మృతులకు పరిహారం పెంపు.. మొన్న కోటి.. ఇప్పుడు మరో..

తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది.

Air India Compensation: ఎయిరిండియా ప్రమాద మృతులకు పరిహారం పెంపు.. మొన్న కోటి.. ఇప్పుడు మరో..

Updated On : June 14, 2025 / 7:45 PM IST

Air India Compensation: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం వ్యవహారంలో ఎయిరిండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం మొత్తాన్ని పెంచింది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 25లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా.. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించింది. తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది. టాటా సన్స్ గతంలో ప్రకటించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల పరిహార మద్దతుకు ఇది అదనం.

”ఎయిర్ ఇండియా నిర్వహణ బృందం నగరంలోనే ఉంది. అవసరమైనంత కాలం మేము అహ్మదాబాద్‌లోనే ఉంటాము. తక్షణ ఆర్థిక సాయం అందించడానికి, మృతుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన వారికి ఎయిర్ ఇండియా రూ. 25 లక్షలు ఇస్తుంది” అని ఎయిర్ ఇండియా సీఈఓ కాంబెల్ విల్సన్ తెలిపారు. ”ఎయిర్‌లైన్ బృందాలు అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాల ప్రైవసీ ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని విల్సన్ అభ్యర్థించారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల్లో ముందు జాగ్రత్త భద్రతా తనిఖీలను పూర్తి చేసే ప్రక్రియలో ఉందని విల్సన్ చెప్పారు. విమానం డేటా రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారని, ప్లేన్ క్రాష్‌పై అధికారిక దర్యాప్తులో చేర్చబడుతుందని తెలిపారు.

“విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంఘీభావం తెలుపుతోంది. ఈ క్లిష్ట సమయంలో సంరక్షణ, మద్దతును అందించడానికి మా బృందాలు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నాయి” అని ఎయిర్‌లైన్ తెలిపింది.

Also Read: 11A సీటు.. 27ఏళ్ల క్రితమే అద్భుతం.. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నటుడు ఇతడే..

ఈ నెల 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గాల్లోకి లేసిన క్షణాల్లోనే నేలకూలింది. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి పెరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్ లోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ కాంప్లెక్స్ పై విమానం కూలిపోయింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 242 మంది ఉన్నారు. వారిలో ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. విమానం హాస్టల్ పై కూలిన ఘటనలో మరో 29మంది మరణించారు. వారిలో ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నారు.

విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీనికి సంబంధించిన ఆధారాల కోసం ఫోరెన్సిక్ బృందాలు, విమానయాన నిపుణులు ఇప్పటికీ శిథిలాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో హైలెవల్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.