నటించే పెళ్లి కూతురు వంటివారు మోడీ

పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివారు మోడీజీ అని సిద్దూ అన్నారు. రోటీలు చేస్తూ గాజులతో శబ్దం చేయడం చూసి పెళ్లికూతురు బాగా పనిచేస్తోందని ఇరుగుపొరుగు వారు అనుకుంటారని, సరిగ్గా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరిగింది కూడా ఇదేనని సిద్ధూ అన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పర్యటించిన సిద్దూ…’ఇండియా డివైడర్ ఇన్ చీఫ్’ హెడ్ లైన్ తో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ ఆర్టికల్ ను ప్రస్తావిస్తూ… మోడీ అబద్ధాలాడటంలో చీఫ్ అని, డివైడర్ ఇన్ చీఫ్ అని, అంబానీ, అదానీల బిజినెస్ మేనేజర్ అని సిద్ధూ విమర్శలు గుప్పించారు.
బీజేపీని, ఆ పార్టీ నేతలను బ్రిటిషర్లతో సిద్ధూ పోలుస్తూ, ఈ దేశం నుంచి వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.మౌలానా అజాద్.మహాత్మగాంధీల పార్టీ కాంగ్రెస్ అని,బ్రిటీష్ రూల్ నుంచి భారత్ కు స్వాత్రంత్యం కోసం కాంగ్రెస్ పోరాడిందని సిద్దూ తెలిపారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ, హామీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలపై,నల్లధనం వెనక్కి తీసుకురావడంపై ఓపెన్ డిబేట్ కు రావాలని తాను మోడీకి సవాల్ విసురుతున్నానని సిద్దూ అన్నారు.డిబేట్ లో తాను కానీ ఓడిపోతే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్దూ సవాల్ విసిరారు.దేశంలోని ప్రతి ప్రజాస్వామ్య,రాజ్యాంగబద్దమైన వ్యవస్థలను మోడీ నాశనం చేశారని సిద్దూ విమర్శించారు.సీబీఐని పుప్పెట్ గా మార్చారని అన్నారు.
ప్రధాని మోడీ అమరుల శవాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శుక్రవారం సిద్దూకి ఈసీ నోటీస్ జారీ చేసింది.గత నెలల కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు 72గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.