CAA, NRCపై మోడీ క్లారిటీ : అవన్నీ అబద్దాలే.. ప్రజల హక్కులను హరించేవి కాదు!

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ఈ కొత్త చట్టం ఆమోదంతో ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రం అసోంలో భగ్గుమంది. అక్కడి నివాసులంతా పౌరసత్వ చట్టాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోనళలు ఉధృతం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమంతో నిరసన గళం వినిపిస్తున్నారు. పౌరసత్వ చట్టం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ కూడా ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచి నిరంతరాయంగా ఆందోళనలతో అసోం అట్టుడికిపోతోంది. మరోవైపు విపక్షాలు కూడా పౌరసత్వ చట్టాన్ని తప్పుబడుతూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం (డిసెంబర్ 22, 2019)లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పబ్లిక్ ర్యాలీలో మోడీకి పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక సెగ తగిలింది. ఈ సందర్భంగా ఆయన ర్యాలీలో ప్రసంగిస్తూ.. CAA చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు.
నేను మీ సేవకుడిని.. నమ్మండి :
CAA చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను శాంతించాలని మోడీ కోరారు. కొత్త చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు రావని మరోసారి మోడీ భరోసా ఇచ్చారు. ఈ మోడీ.. ప్రజలు సేవకుడు.. ఈ సేవకుడిని నమ్మండి అన్నారు. CAA చట్టంలో అసలు ఏముందో ఓసారి ఆందోళనకారులంతా చదవాలని అన్నారు. చట్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దేశ ఐక్యత, శాంతి, సామరస్యం కోసమే తాను పనిచేస్తున్నట్టు మోడీ చెప్పుకొచ్చారు. అంతేకానీ, ఎవరూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేయడం లేదని మోడీ తెలిపారు.
ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు :
CAA అమలుపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని మోడీ చెప్పారు. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం (CAA), 2019, నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) రెండు అంశాలపై మోడీ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. ప్రజల హక్కులను హరించడానికే ఈ చట్టాన్ని తాను తీసుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
ఈ రెండింటితో భారత్‌లోని ముస్లింలకు ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలు, పట్టణ నక్సల్స్ కలిసి ముస్లింలను పురిగొల్పుతున్నారని, ముస్లింల మనస్సుల్లో భయాందోళన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ విమర్శించారు. ‘భారతదేశంలో నివసించే ముస్లింలందరికి పౌరసత్వం చట్టం, ఎన్ఆర్‌సీ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు.
దేశంలో నిర్భంద కేంద్రాలేవి లేవు :
ఈ చట్టంతో ముస్లింలను నిర్భంధ కేంద్రాలకు తరలిస్తారంటూ కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ చేస్తున్న దుష్ర్పాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా నిర్భంద కేంద్రాలు అంటూ ఏమి లేవన్నారు. మరోవైపు జాతీయవ్యాప్తంగా తీసుకొచ్చే NRCపై కూడా మోడీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకూ దీనిపై పార్లమెంటులో లేదా కేంద్ర కేబినెట్ లో కూడా చర్చించలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఎందుకంటే.. అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసోంలో మాత్రమే అమల్లోకి తెచ్చినట్టు తెలిపారు. ‘ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుంది ఎవరో గుర్తించాల్సి ఉందన్నారు. దశబ్దాలుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. దేశ ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తున్నట్టు మోడీ విమర్శించారు.