మోడీ గో బ్యాక్… ప్రధాని తమిళనాడు పర్యటనలో ట్వీట్ల వార్

ఆదివారం(జనవరి 27,2019) తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగాయి. మధురైలో ఆదివారం ఎయిమ్స్ కు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా మోడీ పర్యటనపై నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది గజ తుఫాన్ వచ్చిన సమయంలో మోడీ కనీసం ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదని, తుఫాను ధాటికి అతలాకుతలమైన తమిళనాడుని కేంద్రప్రభుత్వం ఆదుకోలేదని ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
మెజారిటీ ట్వీట్లు… హేతువాద నాయకుడు ఈవీఆర్ రామస్వామి కార్టూన్ తో మోడీ గో బ్యాక్ అని చెబుతున్నట్లుగా ఉంది. నాలుగేళ్ల క్రితం మధురైలో ఎయిమ్స్ నిర్మిపస్తామని మోడీ ప్రామిస్ చేశారని, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. ఇదంతా కొంత మంది చేయిస్తున్న తప్పుడు ప్రచారమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో తమిళనాడు వెల్ కమ్ మోడీ ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
మరోవైపు ఎండీఎంకే పార్టీ కార్యకర్తలు నల్ల జెండాలు, బ్యాడ్జీలు, చొక్కాలు ధరించి మోడీ పర్యటన పట్ల నిరసన వ్యక్తం చేశారు. మధురై వీధుల్లో పర్యటిస్తూ మోడీ, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.