మోడీ నామినేషన్ ఇవాళే…కిక్కిరిసిపోయిన వారణాశి రోడ్లు

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 02:15 AM IST
మోడీ నామినేషన్ ఇవాళే…కిక్కిరిసిపోయిన వారణాశి రోడ్లు

Updated On : April 26, 2019 / 2:15 AM IST

ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ఇవాళ(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ సందర్భంగా గురువారమే మోడీ వారణాశికి చేరుకుని భారీ రోడ్ షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ సీనియర్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.బెనారస్‌ హిందూ యూనివర్శిటీ(కాశీ విశ్వవిద్యాలయం) వ్యవస్థాపకుడు పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం మోడీ ఈ రోడ్ షోను ప్రారంభించారు.వారణాశిలోని లంక, అస్సి ప్రాంతాల మీదుగా దాదాపు ఏడు కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. కాషాయ కుర్తా,స్కార్ఫ్ ధరించిన మోడీ.. రోడ్డుకు ఇరువైపులా వేల సంఖ్యలో చేరిన ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు.దశాశ్వమేధ ఘాట్‌ దగ్గర రోడ్ షో ముగిసింది. అనంతరం అక్కడ జరిగిన గంగాహారతి కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.యూపీ సీఎం యోగి,అమిత్ షా కూడా మోడీతో కలిసి గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు. 11 గంటలకు కాలభైరవ మందిరంలో పూజల అనంతరం 11.30గంటలకు మోడీ నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు.నామినేషన్‌ కార్యక్రమానికి అకాలీదళ్‌ నాయకుడు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే, కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్, ఇతర ఎన్‌డీఏ నేతలు హాజరుకానున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వారణాశి నుంచి పోటీ చేసిన మోడీ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి వారణాశి నుంచే మోడీ పోటీ చేస్తుండటంతో ఈసారి ఎలాగైనా గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేలా బీజేపీ నాయకులు ఫ్లాన్ చేస్తున్నారు.ఏడో విడతలో మే-19,2019న వారణాశి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగనుంది.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.